ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – బొగ్గు ఉత్పత్తి కన్నా కార్మికుల ప్రాణాలు విలువైనవని, రక్షణ లేని ఉత్పత్తి అవసరం లేదని, రక్షణ పై ఉన్న నియమ నిబంధనలను పాటిస్తూ అందరూ కలిసి సురక్షిత సింగరేణిని ఆవిష్కరించే లక్ష్యంతో పనిచేస్తూ ఉత్పత్తిని సాధించాలని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ కార్మికులకు పిలుపునిచ్చారు. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా ఆయన 11 ఏరియాలోని మొత్తం 40 గనులు, విభాగాలకు చెందిన రక్షణ కమిటీలు, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు, మైన్స్ కమిటీ సభ్యులు, ఇతర రక్షణ సూపర్వైజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఎప్పుడూ గనుల్లో మేనేజర్ల సమక్షంలోనే జరిగే ఈ సమావేశాన్ని సంస్థ సీఎండీ స్వయంగా నిర్వహించి నేరుగా సలహాలు సూచనలు స్వీకరించడం ఇదే తొలిసారి కావడంతో కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ అన్ని రంగాలలో అత్యుత్తమ కంపెనీగా నిలిచినప్పటికీ ప్రమాదాల నివారణలు మాత్రం కొంత వెనకబడటం విచారకరమని, దీనికి కారణం ఎక్కువగా మానవ తప్పిదాలే అని సీఎండీ పేర్కొన్నారు.
ప్రతి పనికి కొన్ని ఎస్ ఓ పి (సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్) నిర్దేశించబడ్డాయని, వీటిని సరిగా పట్టించుకోక పోవడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ వీటిని పాటించాలన్నారు.
కార్మికుల రక్షణకు ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా సౌకర్యాలు సౌకర్యాలు సమకూరుస్తామన్నారు. ఆసుపత్రుల్లో అవసరమైన ప్రత్యేక వైద్య నిపుణులను నియమిస్తున్నామని, రామగుండం ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపుదిద్దుతున్నామని హామీ ఇచ్చారు. సూపర్వైజర్ల, ఇతర ఉద్యోగుల కొరతను తీర్చేందుకు 1800 పోస్టులకు ఇప్పటికే నియామకల ప్రక్రియ చేపట్టామని, వచ్చే రెండు నెలల్లో ఇది పూర్తవుతుందన్నారు. తద్వారా గనుల్లో సూపర్వైజర్ల కొరత ఉండబోదని స్పష్టం చేశారు.
కార్మిక కాలనీలను గేటెడ్ కమ్యూనిటీ గా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని, దీనికి అందరూ సహకరించాలని కోరారు. చాలామంది ఉన్నత చదువులు చదివిన యువకులు ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నారని, అలాంటిది సింగరేణిలో ఉద్యోగ అవకాశం లభించిన వాళ్లంతా అంకితభావం, సంస్థ పట్ల కృతజ్ఞతతో పనిచేయాలన్నారు. గనిలో జరిగే ప్రమాదాల కన్నా రోడ్డు ప్రమాదాల్లో యువ కార్మికులు మృతి చెందని పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రక్షణ పై అవగాహనకు ఎంవీటీసీలలో ప్రత్యేక శిక్షణలు ఇప్పించనున్నట్లు, అలాగే ఎంవీటీసీలను ఆధునికీకరించనున్నట్లు తెలియజేశారు.
సమావేశంలో పాల్గొన్న రక్షణ, మైన్స్ కమిటీ సభ్యులు అనేక విలువైన సూచనలు చేశారు. వారసత్వ ఉద్యోగాల కారణంగా ఉన్నత చదువులు చదివిన యువకులు సింగరేణిలో చేరారని, వీరికి గనిలో పని చేయడంలో మరింత ప్రత్యేక శిక్షణ అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
సీనియర్ కార్మికులు రిటైర్ అవ్వటం వల్ల కొంత అనుభవ రాహిత్యం ఏర్పడుతుందన్నారు. కార్మికులకు నాణ్యమైన బూట్లు అందించాలని, గనుల్లో మరింత అధునాత ఆటోమేషన్ జరపాలని సూచించారు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ప్రతి ఏరియా నుంచి మాట్లాడిన కార్మికులు సీఎండీ తో నేరుగా మాట్లాడే అవకాశం లభించడంతో భావోద్వేగాలకు గురయ్యారు.
ఈ సమావేశంలో కొత్తగూడెం నుంచి డైరెక్టర్లు ఎన్ వి కె శ్రీనివాస్ (ఆపరేషన్స్, పర్సనల్), డి సత్యనారాయణ రావు(ఈ అండ్ ఎం), జి వెంకటేశ్వర్ రెడ్డి( పి అండ్ పి) మాట్లాడారు. సమావేశానికి జీఎం(కో ఆర్డినేషన్) ఎస్.డి.ఎం.సుభానీ స్వాగతం పలికారు. జీఎం మార్కెటింగ్ శ్రీ రవి ప్రసాద్, అన్ని ఏరియాల నుంచి జీఎంలు, కార్పోరేట్ జీఎంలు పాల్గొన్నారు.