Tuesday, December 3, 2024

Singareni CMD : సింగ‌రేణి బొగ్గు ఉత్ప‌త్తి టార్గెట్ ఫిక్స్

  • రోజుకు 2.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి,
  • అంతే మొత్తం రవాణా
  • 16 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తీయాలి
  • ఉత్పత్తిలో నాణ్యత, రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి
  • ఏరియా జీఎంలకు సీఎండీ ఎన్.బలరామ్ ఆదేశాలు

హైద‌రాబాద్ – పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని సింగరేణితో ఒప్పందం ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడా బొగ్గును సరఫరా చేసేందుకు వీలుగా రోజుకు 2.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని ఛైర్మన్ , ఎండీ ఎన్.బలరామ్ ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తి సాధనకు వీలుగా రోజుకు 16 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న 120 రోజుల్లో ప్రతీ నిమిషం విలువైనదని.. ఉత్పత్తి లక్ష్య సాధనకు అన్ని ఏరియాలు సమష్టిగా కృషి చేయాలన్నారు.

త‌న కార్యాల‌యం నుంచి నేడు అన్ని ఏరియాల జీఎంలతో ఉత్పత్తిపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు బ‌ల‌రాం. గనులలో ప్రతీ నిమిషం ఉత్పత్తికి కీలకమైనదని, ఆలస్యంగా ఉత్పత్తి కార్యకలాపాలు జరగకుండా ప్రతీ గని మేనేజర్, ప్రాజెక్టు అధికారి చొరవ తీసుకోవాలన్నారు. ఉదయం 7 గంటల వరకు అందరు అధికారులు గనుల వద్దకు చేరుకుని కార్మికులకు దిశా నిర్దేశం చేయాలని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరూ విధిగా 8 గంటల పాటు పనిచేసేలా చూడాలని, క్రమశిక్షణ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

కంపెనీ యంత్రాల పనితీరును మెరుగుపరచాలని, కనీసం 18 గంటలు వినియోగించేలా చూడాలన్నారు. అదే సమయంలో ఉత్పత్తి సాధనలో నాణ్యతకు, రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారా సింగరేణి వినియోగదారులను కాపాడుకోగలమని, పోటీ మార్కెట్లో నిలదొక్కుకోగలమన్నారు. స్వీయ రక్షణ కు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, తద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు.

- Advertisement -

నూతన ప్రాజెక్టులైన కొత్తగూడెంలోని వీకే ఓసీ, ఇల్లందులోని రోంపేడు ఓసీలో వచ్చే మూడు నెలల్లో ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. అదే సమయంలో ఒడిశా నైనీ బ్లాక్లో చెట్ల గణన కొంత పూర్తయిన నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తితో ముడిపడిన ఇతర కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు, వేంకటేశ్వరరెడ్డి, జీఎం(కో ఆర్డినేషన్) ఎస్డి.ఎం.సుభానీ, జీఎం(మార్కెటింగ్) డి.రవిప్రసాద్, కార్పోరేట్ జీఎంలు, ఏరియా జీఎంలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement