Friday, November 22, 2024

Singareni | రాజస్థాన్ విద్యుత్ విభాగ అధికారులతో సింగరేణి సీఎండీ భేటీ..

సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ గురువారం రాజస్థాన్ రాజధాని జైపూర్ లో విద్యుత్ విభాగ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆయనతోపాటు డైరెక్టర్ (ఈ అండ్ ఎం) సత్యనారాయణ రావు, జీఎం (సోలార్) జానకీరామ్, చీఫ్ ఆఫ్ పవర్ విశ్వనాథరాజు ఉన్నారు. మొదట ఆయన రాజస్థాన్ రాష్ట్ర ఇంధన శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ, ట్రాన్స్‌కో సీఎండడీ అలోక్‌ను కలిశారు. సింగరేణి ఆధ్వర్యంలో ప్లాంట్ ఏర్పాటుకు ముందుకువస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

అనంతరం రాజస్థాన్ జెన్కో సీఎండీ దేవేంద్ర శ్రింగి, రాజస్థాన్ రెన్యువబుల్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నథ్‌మల్ డైడెల్, రాజస్థాన్ డిస్కమ్స్ చైర్మన్ భాను ప్రకాశ్‌ ఏటూరును కలిసి ప్లాంట్ ఏర్పాటు, పూర్తయిన తర్వాత విద్యుత్ కొనుగోలు తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు.

సింగరేణి సంస్థ ఇప్పటికే 235 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను సింగరేణి వ్యాప్తంగా ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తుందని, వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న యోచనతో ఉన్నట్లు సంస్థ చైర్మన్‌ బలరామ్ వివరించారు.

రాజస్థాన్‌లోని సోలార్ పార్కులో మెగా ప్లాంట్ ఏర్పాటుకు గల అవకాశాలపై చర్చించారు. సోలార్ పార్కులో సింగరేణి సోలార్ ప్లాంట్‌కు అనుకూలమైన స్థలాన్ని పరిశీలించిన తర్వాత పూర్తి ప్రతిపాదనలతో మరోసారి సమావేశం అవుతామని వివరించారు. రాజస్థాన్‌లో మెగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే సింగరేణి ఆర్థిక పరిపుష్టికి దోహదపడుతుందని బలరామ్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement