తెలంగాణ ట్రీ మ్యాన్ అవార్డు గ్రహీత, సింగరేణి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ ఆదివారం నాడు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో స్వయంగా పార పట్టుకుని 209 మొక్కలను నాటి పర్యావరణ స్ఫూర్తిని చాటారు. దీనితో ఆయన రికార్డు స్థాయిలో 18, 500 మొక్కలు నాటడం పూర్తి చేశారు.
ఆదివారం ఆయన సింగరేణి ధర్మాలు విద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా అక్కడి ఖాళీ ప్రదేశంలో మరో 209 మొక్కలు నాటి 18,500 మైలురాయిని చేరుకున్నారు. తాను నాటిన మొక్కల ప్రదేశాలు అన్నిటికీ ఆయన జియో టాగింగ్ చేశారు. నిత్యం ఆ మొక్కలు ఎలా పెరుగుతున్నాయి అనేది తన కార్యాలయంలో జియో టాగింగ్ ద్వారా పరిశీలిస్తుంటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్బన ఉధ్గారాలు పెరిగి గ్లోబల్ వార్మింగ్ కు దారి తీస్తున్న క్రమంలో వరదలు, కరవు లాంటి ప్రకృతి విపత్తులు తరచూ సంభవిస్తున్నాయని, ఇకనైనా మానవాళి మేల్కొని మొక్కలు నాటుతూ భూమాతను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ నేపథ్యంలో తాను స్వయంగా ఇప్పటివరకు ఆరు జిల్లాలలో 40 చోట్ల పైగా మొక్కలను పెద్ద సంఖ్యలో నాటానని ఇందులో 35కు పైగా మినీ ఫారెస్టులుగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇది తనకు ఎంతో సంతృప్తిని కలిగిస్తుందని, ముఖ్యంగా నాటిన మొక్కల్లో 90 శాతంపైగా వృక్షాలుగా మారడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం మూడు మొక్కలు నాటాలని, వాటిని పెంచాలని సూచించారు.