Wednesday, November 20, 2024

నేడు ఢిల్లీలో బీజేపీ భీమ్​ దీక్ష .. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసన..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాజ్యాంగాన్ని మార్చాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ తెలంగాణా బీజేపీ నేతలు గురువారం మౌన దీక్షకు దిగనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తమ పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాబూరావు, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం సహా పలువురు నేతలతో కలిసి మౌన దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 11 గంటల నుంచి రాజ్ ఘాట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపనున్నారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ అంబేద్కర్ ను అవమానించిన కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

అన్ని పార్టీలూ ఏకం కావాలి

బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి బండి సంజయ్ పాలాభిషేకం చేశారు. నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాబూరావు, పార్టీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాల సుబ్రమణ్యం, కేంద్ర జల వనరుల విభాగం సలహాదారు వెదిరె శ్రీరాం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ సిగ్గు, సోయి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణా సమాజం సిగ్గుతో తల దించుకునేలా చేసిన ఈ మూర్ఖుడు సీఎం ఎలా అయ్యాడోనని దేశం ప్రశ్నిస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగం వల్ల నీకొచ్చిన ఇబ్బందేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. బడ్జెట్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేయడంలో ఇబ్బందేమీ లేదన్న ఆయన బూతులు మాట్లాడ్డం మంత్రం సిగ్గు చేటని విరుచుకు పడ్డారు. దళితుణ్ని సీఎం చేస్తానని ఇచ్చిన మాట తప్పడానికి కేసీఆర్‌కు దళితులపై ఉన్న ద్వేషం, కసే కారణమా అని ప్రశ్నించారు. దళిత బంధు ఎంత మందికి ఇచ్చావో చెప్పే దమ్ముందా? అని అడిగారు. రాజ్యాంగాన్ని ముట్టుకుని చూడు మసి అయిపోతావంటూ జోస్యం చెప్పారు. కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్టు కట్టామని చెప్పుకుంటున్న కేసీఆర్, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.

ఇలాంటి సీఎం ఇంకా కొనసాగడం ఎంత వరకు న్యాయమో తెలంగాణ సమాజం ఆలోచించాలని ఆయన అన్నారు. తెలంగాణా సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్న బండి సంజయ్ తెలంగాణాకు అన్యాయం జరిగితే ఏడేళ్లుగా ప్రధానిని కలిసి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. తనను, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికే కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై అన్ని పార్టీలు స్పందించాలని పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement