ప్రభన్యూస్ : అక్రమ నిర్మాణాలపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కన్నెర్రజేసింది. చెరువులు, నాలాలు కబ్జాలు చేస్తూ అడ్డగోలుగా వెలుస్తున్న వెంచర్లపై కొరడా ఝళిపించింది. దుండిగల్ మునిసిపాలిటీ పరిధిలోని మల్లంపేటలో హెచ్‌ఎండిఏ, సిఎండిఏల అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిం చిన 100కి పైగా విల్లాలను అధికారులు సీజ్ చేయగా.. మరో నాలుగింటిని కూల్చివేశారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా, పురపాలక శాఖ అధికారులు మల్లంపేటలో మొత్తం 260 అక్రమం గా నిర్మించిన విల్లాలను గుర్తించారు.. హైదరాబాద్ చుట్టూ ఇలాంటి వెంచర్లు వందలాదిగా ఉన్నాయి, రియల్టర్లు.. బిల్డర్ల ధనధాహం కారణంగా మధ్యతరగతి కొనుగోలుదారులు బలవుతున్నారు.
తెలంగాణ నూతన మునిసిపాలిటీ చట్టం 2019 సెక్షన్ 181(1) కింద అక్రమ నిర్మాణాలను సీజ్ చేసి, అధికారులు వాటికి బానర్లను ఏర్పాటు చేశారు. ఇదే ప్రాంతంలో హెచ్‌ఎండీఏ ఆమోదం పొందిన మరో 66 విల్లాలు ఉన్నాయి. అన్ని అనుమతులు ఉన్న వీటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని అధికారులు వెల్లడించారు.
మల్లంపేట పరిధిలో ఉన్న కత్వా చెరువుకు బఫర్‌జోన్‌లో ఎనిమిది విల్లాలను అక్రమంగా నిర్మించారని మునిసిపల్ శాఖ వర్గాలు తెలిపాయి. అక్రమంగా నిర్మించిన 260 నిర్మాణాల కంటే ఇవి భిన్నమైనవి. వీటిలో నాలుగింటిని కూల్చివేసిన అధికారులు మిగిలిన నాలుగింటిని కూడా కూల్చివేయనున్నట్లు తెలిపారు. అక్రమంగా నిర్మించిన విల్లాల కూల్చివేత, సీజ్‌లను చేపట్టాలని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ లేఖ ద్వారా దుండిగల్ మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై సీరియస్‌గా వ్యవహరించాలని ఆదేశించిన నేపథ్యంలో.. కలెక్టర్‌లు ఫిర్యాదులపై సీరియస్‌గా స్పందిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital