Tuesday, November 19, 2024

TG – మహిళా కానిస్టేబుల్ పై గన్ పాయింట్ – లైంగిక దాడి.. కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ అరెస్ట్


మహాదేవాపూర్/భూపాలపల్లి ప్రతినిధి: (ప్రభ న్యూస్)
శాంతి భద్రతలు కాపాడాల్సిన ఖాకిలే విధులు మరిచి రాసలీలల్లో మునిగి తేలుతుండటంతో సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలకు పోలీసులు అంటేనే నమ్మకం పోతుంది. ఓ వైపు డైనమిక్ అధికారి మల్టీ జోన్ ఐజి స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటున్నా.. కొందరు అధికారులు మాత్రం అధికార పార్టీ నాయకుల అండదండలు వున్నాయని అరచాకాలు సృష్టిస్తూ ఎవరు ఏం చేయలేరనే విధంగా వ్యవహరిస్తున్నారు.

స్వంత డిపార్ట్ మెంట్ లో పై స్థాయి సర్కిల్ అధికారి నియంత్రణ లేకనే కిందిస్థాయి అధికారులు, సిబ్బంది రెచ్చిపోతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. కొన్ని చోట్ల కీచక అధికారుల బాగోతాలు బయటకు వస్తున్నా.. మరికొన్ని చోట్ల పెద్దల పైరవీలతో నీరుగారిపోతున్నాయి .

తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ఠాణా లో పని చేస్తున్న ఓ మహిళ కానిస్టేబుల్ పై కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సదరు మహిళా కానిస్టేబుల్ పలు మార్లు తమ పై అధికారికి మౌఖికంగా పిర్యాదు చేసింది. కానీ ఫలితం లేకపోవడంతో ఎస్సై ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోగా చివరకు సర్వీస్ రివాల్వార్ ఎక్కుపెట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ మహిళ కానిస్టేబుల్ నేరుగా జిల్లా, రాష్ట్ర స్థాయి పోలీసు బాస్ లకు పిర్యాదు చేసింది.

- Advertisement -

దీంతో ఉన్నత అధికారుల ఆదేశంతో జిల్లాలోని భూపాలపల్లి, కాటారం డీఎస్పిల ఆద్వర్యంలో పోలీసులు మంగళవారం అర్థరాత్రి కాళేశ్వరం కన్నేపల్లి క్వార్టర్ లో ఎస్సై భవాని సేన్ ను అరెస్ట్ చేసి భూపాలపల్లి ఠాణాకు తరలించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.

ఉద్యోగం నుంచి సస్పెండ్ –

ఎస్సై భవాని సేన్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్లు ఐజి రంగనాథ్ ప్రకటించారు.


— గతంలోనూ ఇదే చెత్త రికార్డ్


ఈ ఎస్సై గతంలో పని చేసిన ఠాణాల్లో ఇలాంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. కంపిటేటివ్ పరీక్షలకు బుక్స్ ఇస్తానని వో అమ్మాయిని లైంగిక వేధింపులకు గురిచేయడం , ఆ అమ్మాయి మీడియా ముందుకు రావడంతో కీచక బాగోతం బయటపడి అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇలాంటి కీచక అధికారుల చేష్టలతో మహిళా కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించాలంటే జంకుతున్నారు. ఇలాంటి ఘటనలు పురావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి అధికారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు పేరు చెప్పలేని మహిళా కానిస్టేబుల్ కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement