హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బిఆర్ఎస్ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం తధ్యమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో స్పల్ప తేడాతోనే అధికారం చేజార్చుకున్నామని, ప్రజలలో కూడా బిఆర్ఎస్ పట్ల ఓటమి తర్వాత సానుభూతి గణనీయంగా పెరిగిందని చెప్పారు. తెలంగాణ భవన్లో బుధవారం నాడు వరంగల్ పార్లమెంట్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు , ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిన తెలంగాణను మళ్లీ తెచ్చుకుందాం…
ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు. శాసనసభ ఎన్నికల్లో కలిసి మాట్లాడుకునే అవకాశం రాలేదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం. తల్లడిల్లి ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు చల్లగా కాపాడుకున్నాం. కొన్ని తప్పిదాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందాము. ఇప్పుడు తెలంగాణ మళ్లీ ఢిల్లీ నేతల చేతుల్లోకి వెళ్లింది. మన తెలంగాణ మన చేతులోకి తెచ్చుకునే సమయం ఆసన్నమైంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు, ప్రజలు ఆలోచిస్తున్నారు. తెలంగాణ గళం, బలం ఢిల్లీలో వినపడాలంటే మనం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉన్నది. సమీక్షా సమావేశంలో మీకు మాట్లాడే అవకాశం ఇస్తున్నాము. మీరు చెప్పిన ప్రతీ అభిప్రాయం నోట్ చేసుకుంటాం’ అని వివరించారు.అసెంబ్లీ ఎన్నికల్లో తాము చేసిన కొన్ని తప్పిదాల వల్లే ఓటమి చెందినట్టు ఈ సమావేశంలో ఆయన ఒప్పుకున్నారు.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు పార్టీ నేతలు, శ్రేణులకు భరోసా ఇచ్చారు.
వినయ్ భాస్కర్ పై ఫైర్..
అలాగే, ఈ సమవేశానికి ఆలస్యంగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి లేటే, మీటింగ్‌కు కూడా ఆలస్యంగానే వస్తారా? అని చురకలు అంటించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మధుసుధనా చారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, పొన్నాల లక్ష్మయ్య, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.