Friday, November 22, 2024

Prison: మానవ‌త్వం చూప‌డ‌మే పాప‌మా… స్వ‌దేశానికి వ‌స్తూ జైలుపాలు

పొట్ట‌కూటి కోసం ప‌రాయి దేశం వెళ్లి స్వదేశానికి తిరిగి వ‌స్తున్న‌భార‌త్ వాసి జైలు పాల‌య్యాడు. ఆ వ్య‌క్తి చేసిన త‌ప్ప‌ల్లా మాన‌వ‌త్వం చూపడం. అదే అత‌డ‌ని జైలుపాలు చేసింది.

జగిత్యాల జిల్లా రూరల్‌ మండలం పొలాసకు చెందిన బద్దెనపల్లి శంకరయ్య ఉపాధి నిమిత్తం 14 ఏండ్లుగా సౌదీ అరేబియాకు వెళ్లొస్తున్నాడు. అక్కడ మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శంకరయ్యకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. భార్య బీడీలు చుట్టడంతోపాటు కూలీ పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నది. శంకరయ్య గత ఏప్రిల్‌లోనే స్వదేశానికి వచ్చి వెళ్లాడు. ఇక స్వగ్రామంలోనే ఉండాలని నిర్ణయించుకొని అక్కడి కంపెనీతో అన్నీ సెటిల్‌ చేసుకున్నాడు. గత నెల 12న స్వదేశానికి బయలుదేరాడు.

అయితే విమానంలో తన సీటు పక్కన సీటులో ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ శ్రీలంక మహిళ ప్రయాణం చేసింది. చలితో ఆ చిన్నారులు వణుకుతుండటంతో వారికి శంకరయ్య దుప్పటి కప్పే ప్రయత్నం చేశాడు. దీంతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విమాన సిబ్బందికి చిన్నారి తల్లి ఫిర్యాదు చేసింది. కొలంబోలో విమానం ఆగిన వెంటనే శంకరయ్యను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు. న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసినా జమానత్‌ ఇచ్చేవారు లేకపోవడంతో శంకరయ్య శ్రీలంకలోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం చొరవ తీసుకొని తిరిగి ర‌ప్పించాల‌ని కుటుంబ‌స‌భ్యులు వేడుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement