Wednesday, November 20, 2024

TG | ప‌ది నెల‌లు కాలే దిగిపోవాల్నా? కేసీఆర్ ను నిల‌దీసిన‌ రేవంత్

  • నిజాల‌ను ఎదుర్కొనే ధైర్యం కేసీఆర్‌కు ఉందా
  • ప‌దేండ్ల‌లో చేయ‌లేని ప‌నులు ప‌ది నెల్లోనే చేశాం
  • ఎన్నిక‌ల్లో ఓడిపోయినా బీఆర్ఎస్‌కు బుద్ధి రాలేదు
  • కేటీఆర్‌, హ‌రీశ్ అభివృద్ధి అడ్డుకునే య‌త్నాలు
  • తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష నెర‌వేరుతుంది
  • ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ
  • వేముల‌వాడ విజ‌యోత్స‌వ స‌భ‌లో ఉద్వేగ ప్ర‌సంగం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, వేముల‌వాడ‌, క‌రీంన‌గ‌ర్ : తాము అధికారంలోకి వ‌చ్చి ప‌దినెల‌ల్లోనే ప‌ద‌వి దిగిపోవాల్నా.. వారి ప‌దేండ్ల పాల‌న‌లో చేప‌ట్ట‌ని అభివృద్ధ‌ని ప‌ది నెల‌ల్లోనే చేసి చూపించాం అని సీఎం రేవంత్ అన్నారు. బుధ‌వారం వేముల‌వాడ రాజ‌న్న‌ను ద‌ర్శించుకున్న త‌ర్వాత జ‌రిగిన స‌భ‌లో ఉద్వేగంగా ప్ర‌సంగించారు. రైతుల‌కు రుణ‌మాఫీ చేశామ‌ని కేసీఆర్ స‌భ‌కు వ‌స్తే లెక్క‌లు అప్ప‌జెప్తామ‌ని అన్నారు. నిజాల‌ను ఎదుర్కొనే ధైర్యం కేసీఆర్‌కు లేద‌ని విమ‌ర్శించారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయినా బీఆర్ఎస్‌కు బుద్ధి రాలేద‌ని మండిప‌డ్డారు.

అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌..

కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే నిల‌బెట్టుకుంటుంద‌ని సీఎం రేవంత్ అన్నారు. వేముల‌వాడ విజ‌యోత్స‌వ స‌భ‌లో ప్ర‌సంగిస్తూ.. కాంగ్రెస్ హ‌యాంలోనే సాగు నీటి ప్రాజెక్టులు నిర్మించామ‌న్నారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ ప‌నిచేసి ఉంటే సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు పెండింగ్‌లో ఉంటాయ‌ని ప్ర‌శ్నించారు. ఆ రెండు పార్టీలు ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయ‌లేద‌న్నారు. క‌రీంన‌గ‌ర్‌లో బండి సంజ‌య్ కుమార్ రెండు సార్లు ఎన్నిక‌య్యార‌ని, అయినా క‌రీంన‌గ‌ర్‌లో ఏం అభివృద్ధి సాధించార‌ని ప్ర‌శ్నించారు. క‌రీంన‌గ‌ర్ అభివృద్ధికి ఒక్క కాంగ్రెస్ మాత్ర‌మే క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. కేటీఆర్‌, హ‌రీశ్‌రావు అభివృద్ధిని అడ్డుకునేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

- Advertisement -

కేసీఆర్ గ‌డీల‌ను కూల్చేందుకు

మాజీ సీఎం కేసీఆర్ గ‌డీల‌ను కూల్యేందుకు పాద‌యాత్ర చేశామ‌ని సీఎం అన్నారు. ప‌దేళ్ల‌లో కేసీఆర్ చేయ‌లేని ప‌నుల‌ను తాము చేసి చూపించామ‌న్నారు. రాష్ట్రానికి రూ.ఏడు ల‌క్ష‌ల కోట్లు అప్పులు మాత్ర‌మే మిగిల‌చార‌ని అన్నారు. తాము రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల రుణ‌మాపీ చేశామ‌న్నారు. మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేత‌లు కేటీఆర్‌, హ‌రీశ్‌రావు అభివృద్ధిని అడ్డుకుంటున్నార‌న్నారు.

కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పదేళ్ల మీ ప్రభుత్వంలో చేసిన రుణమాఫీ 10నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన రుణమాఫీపై లెక్కలు చెబుతామన్నారు. నిరుద్యోగ సమస్యపై తెలంగాణ ఉద్యమం నడిచిందని పదేళ్ల మీ పరిపాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ప్రజాపాలన ఏర్పడి పది నెలల కాలంలోనే 50వేల ఉద్యోగాలు ఇచ్చామని, దమ్ముంటే ఎల్బీ స్టేడియంకు రావాలని 50వేల తలకాయలు చూపెడతానని లేకపోతే క్షమాపణ చెబుతానన్నారు.

కాలేశ్వరం పేరిట లక్ష కోట్ల ప్రజాధనం వృధా చేశారన్నారు. కొండపోచమ్మ సాగర్ నుండి తన ఫామ్ హౌస్ కు ప్రత్యేకంగా కాలువ నిర్మించుకొని నీటిని తరలించుకుపోయారన్నారు. తెలంగాణలో పరిశ్రమలు పెట్టొద్దా ప్రజలకు చెప్పాలని, భూసేకరణ జరగకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రౌడీ మూకలను పెట్టి కలెక్టర్ తో పాటు అధికారులపై దాడులు చేసిన హీనమైన చరిత్ర బీఆర్ఎస్ నాయకులదన్నారు. కుట్ర పన్నిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందన్నారు. కొడంగల్ లో వేయి ఎకరాల భూమి సేకరణ చేస్తే కడుపు మంట వస్తుందా అన్నారు.

అభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు రావాలంటే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందేనన్నారు. అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, రైతుల భూములు తీసుకునే ముందే భూముల విలువను మూడు రేట్లు పెంచాలని ఆదేశించామన్నారు. కొడంగల్ నియోజకవర్గం పై కేసీఆర్ కుటుంబం కక్ష కట్టిందన్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి ఇప్పటికే వారి ప్రయాణ ఖర్చులకోసం 3700 కోట్లు రూపాయలు వెచ్చించామన్నారు. తెలంగాణను ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నామని, అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement