ప్రభన్యూస్ ప్రతినిధి, సూర్యాపేట – నల్గొండ జిల్లాలో బిజెపికి భారీ షాక్ తగిలింది.. మునుగోడు ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్ధిగా బరిలోకి అధికార బిఆర్ఎస్ కు టెన్షన్ తెప్పించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. రేవంత్ రెడ్డిని టిపిసిసి అధ్యక్షునిగా నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. వృద్ధ నాయకులతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని బిజెపి మాత్రమే బీఆర్ఎస్ ను ఓడిస్తుందని వ్యాఖ్యలు చేసి ఉప ఎన్నికలకు తెర లేపారు. ఆయన ఊహకు భిన్నంగా మునుగోడు ప్రజలు తీర్పు ఇవ్వడంతో అతి కొద్దిరోజుల్లోనే తిరిగి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఆయన సైతం పలు మార్లు ఖండించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ప్రచారం ఊపందుకుంది. కార్యకర్తలు సైతం తిరిగి కాంగ్రెస్ లో చేరాలని కోరుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. టీపీసీసీలో కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం.
తొలి జాబితాలో దక్కని చోటు
తిరిగి కాంగ్రెస్ లో చేరేది లేదని రాజగోపాల్ రెడ్డి పలుమార్లు మీడియా ముఖంగా స్వయంగా వెల్లడించారు. ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీలో గెలిచి రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించాలని ఆయన అప్పుడు భావించారు. అనుకున్న విధంగా బిజెపి గ్రాఫ్ పెరగడం లేదని, లిక్కర్ స్కాం కేసులో కవితను అరెస్టు చేయకపోవడంతో బిజెపిని ప్రజలు విశ్వసించడం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో వెళ్ళేందుకే ఇలా మాట్లాడుతున్నారని బిజెపి నాయకులు చర్చిస్తున్నారు. అదేవిధంగా ఆయన సతీమణి లక్ష్మికి మునుగోడు టికెట్టు, తనకు ఎల్బీనగర్ టికెట్ కేటాయించాలని బిజెపి అధిష్టానాన్ని కోరారు. తొలి జాబితాలో ఇరువురిలో ఒక్కరికి కూడా సీటు కేటాయించకపోవడంతో పార్టీ మారుతున్నట్లు చెప్పుకోవచ్చని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది.
అన్నతో తగ్గని అనుబంధం
ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఏకకాలంలో గెలిచిన వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఎలాంటి అరమరికలు లేకుండా తమ బంధాన్ని కొనసాగించారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారిన సందర్భంలో సైతం వెంకట్ రెడ్డి అటు పార్టీకి.. ఇటు తమ్మునికి.. దూరం కాకుండా దూరంగా దూర దేశం వెళ్లి ఎన్నికల తర్వాత పార్టీలో కీలకంగా మారారు. ఆ అనుబంధంతోనే వెంకటరెడ్డి తిరిగి తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చేందుకు మార్గం సుగమం చేశారని సమాచారం.
దూకుడుతోనే నష్టం
టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియామకాన్ని ఎంతో మంది సీనియర్ నేతలు సైతం వ్యతిరేకించారు. ఆ తర్వాత పార్టీ విధానాలను ఏకీభవించి పార్టీలో పనిచేసుకుపోతున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకించడంతో పాటు ఆవేశంగా శాసనసభకు రాజీనామా చేశారు. ఉద్యమ సందర్భం లో ఉప ఎన్నికలతో పార్టీకి హైప్ తీసుకొచ్చిన కేసీఆర్ కు ఉప ఎన్నికలతోనే సమాధానం ఇవ్వాలని ఉప ఎన్నికలకు వెళ్లారు. కానీ ఓటమి చవిచూడడంతో బిజెపిలోనే కొనసాగుతానని చెప్తూ రాజకీయంగా కొంత స్థబ్దుగా ఉన్నారు. తిరిగి కాంగ్రెస్ లో చేరికతో మళ్లీ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తారా.. సంయమనం తో వ్యవహరిస్తారా.. చూద్దాం.