Friday, November 22, 2024

శిల్పా చౌదరి కేసులో కోట్ల లెక్క తేల‌డం లేదు.. ఒత్తిడి చేస్తే హెల్త్ ఇష్యూస్ అంటూ.

కిట్టీ పార్టీల పేరుతో పలువురు సంపన్న మహిళల నుంచి అధిక వడ్డీ ఆశ చూపి కోట్ల రూపాయలను వసూలు చేసిన శిల్పా చౌదరి కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్‌గా మారింది. తొలి దశ కస్టడీలో శిల్పా చౌదరి తానెవరినీ మోసం చేయనని, రాధికారెడ్డి అనే మహిళకు డబ్బులిచ్చి మోసపోవడంతోనే తనకు డబ్బులిచ్చిన వారికి చెల్లించలేకపోయానని పేర్కొన్నారు. దీంతో రాధికారెడ్డిని పోలీసులు విచారించగా తనకు శిల్పా చౌదరి డబ్బులేం ఇవ్వలేదని పేర్కొనడంతో శిల్పా చౌదరి వాస్తవం చెప్పిందా లేక రాధిక తప్పు చెబుతుందా అన్నది తేల్చే పనిలో పోలీసులున్నారు.

కొంపల్లి మల్లారెడ్డి, ఎన్నారై ప్రతాప్‌రెడ్డికి కూడా డబ్బులు ఇచ్చానని పేర్కొంది. వీరిద్దరినీ పిలిపించి శిల్పా చౌదరితో ముఖాముఖి విచారణ చేయాలని భావిస్తున్నారు. రెండవ దఫా రెండవ రోజు కూడా శిల్పా చౌదరి పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పింది. గట్టిగా ప్రశ్నిస్తే తనకు అనారోగ్యంగా ఉందని, మానసికంగా ఒత్తిడికి గురి చేస్తే మైగ్రేన్‌ వచ్చే ప్రమాదం ఉందని, తనకు థైరాయిడ్‌ సమస్య కూడా ఉందని చెప్పడంతో ఏం చేయాలో పోలుపోని స్థితిలో దర్యాప్తు బృందం ఉండిపోయింది. తమ వద్ద ఆధారాలకు సమాధానాలు చెప్పాలని అడిగితే ఒక సందర్భంలో పోలీసులతో వాదనకు దిగిందని తెలుస్తోంది.

పోలీసులకు అందుతున్న ఫిర్యాదుల ప్రకారం శిల్పా చౌదరి దాదాపు రూ. 100 కోట్ల వరకు పలువురి నుంచి తీసుకోగా, పోలీసులకు మాత్రం కేవలం రూ.18 కోట్లు మాత్రమే వేర్వేరు చోట్ల నుంచి అప్పుగా తీసుకున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రెండవ దఫా కస్టడీ విచారణలోనూ శిల్పా చౌదరి ఏ మాత్రం సహకరించక పోవడంతో ఏం చేయాలి, భవిష్యత్‌ విచారణ ఎలా కొనసాగించాలన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement