చౌటుప్పల్, జనవరి 21 (ప్రభ న్యూస్) : మహిళలను లైంగిక వేధింపులకు, ఈవ్ టీజింగ్ వంటి వేధింపులకు గురి చేసిన కేసులలో నిందితులు, సదరు మహిళా బాధితులను, ఇతర మహిళలను ఎటువంటి వేధింపులకు, భయ భ్రాంతులకు గురిచేయకుండా ఉండేందుకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలలో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదివారం రాచకొండ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళా సంరక్షణ నిఘా రిజిస్టర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసిన నిందితుల నుండి బాధితులకు తదుపరి కక్ష పూరిత వేధింపులు, దాడులు వంటివి చేయకుండా ఉండేందుకు వారి ప్రవర్తన కార్యకలాపాల మీద మహిళా సంరక్షణ నిఘా రిజిస్టర్ ద్వారా ఆరు నెలల పాటు ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుందన్నారు. ఈ రిజిస్టర్ ద్వారా గతంలో లైంగిక నేరాలకు పాల్పడిన నేరస్తులు మళ్ళీ అలాంటి నేరాలకు, ఇతర నేరాలకు పాల్పడకుండా నిఘా పెట్టడం జరుగుతుందని తెలిపారు.
సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి లేదా సెక్టార్ ఎస్ఐ ల ఆధ్వర్యంలో ఈ రిజిస్టర్ రహస్యంగా నిర్వహించ బడుతుందని కమిషనర్ పేర్కొన్నారు. బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా, అవసరమైన పక్షంలో వ్యక్తిగతంగా వారికి అవసరమైన భద్రతాపరమైన తోడ్పాటు అందిస్తారని పేర్కొన్నారు. రాచకొండ పరిధిలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, షీ టీమ్స్ ద్వారా డెకాయ్ ఆపరేషన్లు, ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వుమెన్ సేఫ్టీ డీసీపీ ఉషా విశ్వనాథ్, ఏసిపి వెంకటేశం ఇతర అధికారులు పాల్గొన్నారు.