Tuesday, November 26, 2024

షర్మిల‌తో ఉమ్మడి కార్యాచరణ సాధ్యమేనా ?

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : నిరుద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్‌ సర్కార్‌పై ఉమ్మడి పోరాటానికి సిద్ధం కావాలని వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఇచ్చిన పిలుపుకు ఏఏ పార్టీలు స్పందిస్తాయన్న విషయం ఆసక్తికరంగా మారింది. సిద్ధాంత వైరుధ్యాలున్న పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధం అవుతాయా ? ఆమె ప్రయత్నాలు ఎంత వరకు సఫలం అవుతాయనేది చర్చనీయాం శమైంది. ఉమ్మడిగా ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ముందుకు రావాలని ఆదివారం 9 పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, టీజేఎస్‌, మజ్లిస్‌, సీపీఎం, సీపీఐ, జనసేన, మహజన సోషలిస్ట్‌ పార్టీలకు లేఖలు రాశారు.
ఇంతకు ముందు కూడా రాష్ట్ర సమస్యలపై రాష్ట్రపతిని కలుద్దామని ఆమె ప్రతిపక్ష పార్టీల నేతలను కోరారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోమారు ఉమ్మడి పోరాటంపై లేఖలు రాసి సంచలనం సృష్టించారు. కాంగ్రెస్‌, బీజేపీ మధ్య రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా సిద్ధాంతపరంగా విబేధాలు ఉన్నాయి. నువ్వా..,నేనా అన్నట్లుగా వారి మధ్య దూరం ఉంది. ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో ఒక్కతాటిపైకి రావడం అసాధ్యమేనని చెప్పవచ్చు.


అధికార బీఆర్‌ఎస్‌కు ఈ మధ్య కాలంలో సీపీఎం, సీపీఐ పార్టీలు దగ్గర య్యాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేగాక వామపక్షాలకు బీజేపీ అస్సలు పడదు. దేశంలో మతతత్వాన్ని రెచ్చగొడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని కంకణం కట్టుకుని ఉన్నాయి. ఈ రెండు పార్టీలు ప్రధానంగా మతతత్వాన్నే ప్రధాన అంశంగా ప్రజలను చైతన్యం చేసేందుకు యాత్రలు చేపట్టాయి. కాబట్టి కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం పార్టీలు ఉమ్మడి పోరాటంలో పాల్గొనే అవకాశాలు లేవని ఈ పార్టీల నేతలు చెప్పారు.
ఇక టీడీపీ, జనసేన, మహజన సోషలిస్టు పార్టీల విషయానికి వస్తే ఈ పార్టీలు షర్మిల పిలుపునిచ్చిన విధంగా జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) గా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య ఎన్నికల పొత్తులకు కసరత్తు జరుగుతోంది. ఇంకా తుది దశకు చేరుకోనప్పటికీ, భావసారూప్య పార్టీలుగా ఉన్నాయి. మహజన సోషలిస్టు పార్టీ కూడా జేఏసీలో భాగం పంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి బీజేపీ తమను దారుణంగా మోసం చేసిందని, ఆ పార్టీని ఓడించేందుకు ప్రయత్నిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇదివరకే ప్రకటించారు. అయినప్పటికీ, షర్మిలపై ఉన్న గౌరవంతో ఉమ్మడి పోరాటంలో భాగం పంచుకునే అవకాశ ముందని ఎంఆర్‌పీఎస్‌ నేత ఒకరు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement