Wednesday, December 25, 2024

TG | కేంద్ర మంత్రి మండలి నుండి షాను తొలగించాలి.. ఎంపీ వంశీకృష్ణ

పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 24(ఆంధ్రప్రభ): అంబెడ్కర్ పై కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు గర్హనీయమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆక్షేపించారు. పెద్దపల్లి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ… అంబేడ్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను కేంద్ర మంత్రి మండలి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అమిత్ షా ఇప్పుడు తన ముసుగు తీసాడని, ఆరు నెలల క్రితం తీస్తే బాగుండేదన్నారు. అంబేద్కర్ పేరు ఎత్తితేనే అమిత్ షాకు ఎక్కడ లేని కోపమొస్తదని ఎంపీ వంశీకృష్ణ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ముందు అమిత్ షా మాట్లాడి ఉంటే 240 ఎంపీ సీట్లు కూడా వచ్చేవి కావన్నారు.

రాజ్యసభ సాక్షిగా అమిత్ షా బాబా సాహెబ్ అంబెద్కర్ పై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. 75ఏండ్ల క్రితం భారత రాజ్యాంగాన్ని అంబెద్కర్ రచించారని, రాజ్యాంగం ప్రకారం దేశ ప్రజలంతా నడుస్తున్నారని గుర్తు చేశారు. దేశంలో అన్ని మతాలు, కులాలు కలిసి ఉండటం అంబేద్కర్ రాసిన రాజ్యంగం గొప్పతనమన్నారు. బీజేపీకి 2024 ఎన్నికల్లో 400 పైగా సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలను చైతన్యం చేస్తూనే ఉందన్నారు. కర్ణాటకకు చెందిన ఓ ఎంపీ బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బహిరంగంగానే చెప్పారన్నారు. హోంమంత్రి అమిత్ షా బడుగు, బలహీన వర్గాలను ఉద్దేశించి, మీరు తరుచూ అంబేద్కర్ పేరు చెప్పేకంటే, దేవుని పేరు చెప్పినా స్వర్గానికి పోయేవారని మాట్లడటం అన్ని వర్గాల ప్రజలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరుపున రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎంపీలందరూ అమిత్ షాను పార్లమెంటులోనే నిలదీశారన్నారు.

అమిత్ షా వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, వెంటనే పదవికి రాజీనామా చేసి అంబేద్కర్ కు క్షమాపణలు చెప్పాలని, అప్పటి వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. దీనిపై అమిత్ షా మాట మారుస్తూ తాను తప్పుగా మాట్లాడలేదని బుకాయిస్తున్నారన్నారని విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ తప్పుగా మాట్లాడిన అమిత్ షా మీద చర్యలు తీసుకోకుండా, అంబేద్కర్ మీద ప్రేమ ఉన్నట్లుగా ట్వీట్లు చేస్తున్నారన్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ పవిత్రంగా భావించే మనుస్మృతిని నమ్ముకుంటే సమాజం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని భావించి ఆనాడే అంబేద్కర్ మనుస్మృతిని కాల్చివేసి నిరసన తెలిపాడని గుర్తుచేశారు. అంబేద్కర్ లాంటి వ్యక్తి బలహీన వర్గాల కోసం రిజర్వేషన్లను ఏర్పాటు చేశారన్నారు.

- Advertisement -

3000 సంవత్సరాలు బడుగు, బలహీన వర్గాల ప్రజలు పడ్డ ఇబ్బందులను గుర్తించి, అంబేద్కర్ రాజ్యాంగంలో ఆయా వర్గాలకు రిజర్వేషన్లు పొందుపరిచారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ మ్యాగజైన్ లో నిత్యం అంబేద్కర్ మీద విమర్శలు ప్రచురిస్తుంటారని పేర్కొన్నారు. అంబేద్కర్ అన్ని వర్గాలకు ప్రతినిధి అని, ఆర్బీఐ ఏర్పాటులో అంబేద్కర్ ప్రముఖ పాత్ర వహించారన్నారని వివరించారు. మణిపూర్ లో రెండేళ్లుగా హింసాకాండా జరుగుతున్నా హోంమంత్రి అమిత్ షా స్పందించడం లేదని విమర్శించారు. మహిళా రక్షణపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అగ్ర వర్ణాలు దళితులపై చేస్తున్న దాడులను ఆపే చర్యలు ఎక్కడా కన్పించడం లేదని ఆరోపించారు. ఈయుగంలో కూడా దళితుల కోసం పోరాటం చేయాల్సి వస్తుందనుకోలేదన్నారు. సమాజంలో మత, కులపిచ్చి ఉండడం దురదృష్టమన్నారు.

కాకా వర్థంతిని నిర్లక్ష్యం చేశారు.
కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాకా వెంకటస్వామికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం కంటే ప్రజలతో ఉన్న అనుబంధం గొప్పదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. లక్షల మంది పేదలతో ర్యాలీ చేసి 70 వేల మందికి గుడిసెల పట్టాలు ఇప్పించారని తెలిపారు. రామగుండంలో ఆర్ఎఫ్సీఎల్ ఏర్పాటు, సింగరేణిలో కాకా సేవలు ఏ కార్మికుడు మరిచిపోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ తాగు, సాగునీటి కోసం ప్రాణహిత, చేవేళ్ల ప్రాజెక్టుల కోసం కాకా కృషి చేశారని పేర్కొన్నారు.

అలాగే పించన్ విధానాన్ని అమలు చేయించడంలో కాకా పాత్ర ఎంతో ఉందన్నారు. రేషన్ సిస్టం ఏర్పాటు చేయడంలో కాకా ఎంతో కృషి చేశారని, ప్రత్యేక తెలంగాణ పోరాటంలో 1969 నుంచి కాకా తనదైన శైలిని కనబరిచారని తెలిపారు. అలాంటి కాకా వర్థంతిని పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. పెద్దపల్లిలో కలెక్టర్ కుల వివక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో మార్కెట్ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, భూషణవేన రమేష్ గౌడ్, నల్లాల కనకరాజు, సజ్జాద్, వునుకొండ శ్రీధర్ పటేల్, బండారి సునీల్ గౌడ్, గంగుల సంతోష్, మానుమాండ్ల శ్రీనివాస్, కొలిపాక సంపత్, కీర్తి రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement