హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఏది ఏమైనా ఈసారి జరిగే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ అధి నాయకత్వం ఆ దిశగా ఒక్కో అడుగు ముందు కు వేస్తోంది. అదును దొరికిందే తడువుగా బీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే వెలుగులోకి వచ్చిన ‘ఎమ్మెల్యేల ఎర’ కేసును రాజకీయంగా మలుచుకుని అబ్ధి పొందే ప్రయత్నాలు జరుగు తున్నాయి. ‘ఢిల్లి మద్యం మాఫియా’ కేసుతో సీఎం కేసీఆర్ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసి వచ్చే ఎన్నికల్లో ప్రజాధరణ లేకుండా చేయా లన్న కోణంలో కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉన్న బీజేపీ అగ్రనేత అమిత్‌షా పర్యవేక్షణలో ఆపరేషన్ జరుగుతోంది. కేటీఆర్ కుమార్తె కవితను ఈడీ విచారణ అనంతరం అరెస్టు చేసి బీఆర్ఎస్ అధినేత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్న ఎమ్మెల్యేల ఎర కేసు విచారణ సీబీఐ అధీనంలోకి వస్తే కేసీఆర్‌ను నేరుగా టార్గెట్ చేయవచ్చునని బీజేపీ అధిష్టానం అంచనాలు వేస్తోంది. అదే జరిగితే తెలంగాణాలో లక్ష్యాన్ని చేరుకోవడం మరింత సులువవుతుందని ఆ పార్టీకి చెందిన నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరినామాలను పిరిశీలిస్తే ఆ దిశగానే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తెలంగాణాలో రాజకీయ అస్థిరత సృష్టించడం ద్వారా ప్రజల్లో బీఆర్ఎస్పై చులకనభావం పెరుగుతుందని, ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఉంటుందని నరేంద్రమోడీ అంచనాగా కనిపిస్తోంది. అందుకోసమే వ్యూహకర్త అమిత్ షాను ఇక్కడికి పంపించి సీక్రెట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆపరేషన్ 90 లక్ష్యంగా అంతర్గత కసరత్తు ప్రారంభించారు. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ ఏం కోరుకుంటు-న్నారు? ఆయన అసలు తెలంగాణను ఏం చేయాలని భావిస్తున్నారు? అంటే.. అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారనేది ఇప్పుడున్న సమాధానంగా కనిపిస్తోంది. అయితే, ఈ ఆపరేషన్‌కు ముందు మోడీ ఏం చేస్తున్నారనేది పరిశీలిస్తే.. తెలంగాణలో రాజకీయ అస్థిరత సృష్టించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని అంటు-న్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం తెలంగాణలో బలంగా ఉన్న కేసీఆర్ సెంటిమెంటు-ను కూలదోసి.. ప్రజలను బీజేపీవైపు మళ్లిం చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే.. ఇది అంత ఈజీగా జరిగేది కాదు. అందుకే.. ప్రభుత్వా న్నే అస్థిరతకు గురి చేసి.. సర్కారును అచేతనం చేయడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే వ్యూహాన్ని మోడీ చక్కగా అమలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఢిల్లీలో తాము ఎలానూ అధికారంలోకి రాలేకపోయిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం మాత్రం ప్రశాంతంగా ఎందుకు పనిచేయాలనే వ్యూహంతో అస్థిరత సృష్టిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణపై కూడా.. అదే వ్యూహంతో మోడీ ఉన్నారనేది మేధావుల మాట. అదికూడా ఎన్నికలకుముందు ప్రజలకు ప్రభుత్వానికి.. ప్రజలకు కేసీఆర్‌కు మధ్య గ్యాప్ పెంచేయడం ద్వారా వ్యూహం పలిస్తుందన్న కోణంలోనే చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే విషయాలను తాజాగా రాష్ట్ర బీజేపీ నేతలు కూడా బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా బీజేపీ పక్కా ప్లాన్
తెలంగాణ ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు పక్కా ప్లాన్‌తో, పకడ్భందీ వ్యూహంతో కార్యాచరణను అమలు చేస్తున్న బీజేపీ నేతల పనితీరుపై సమాచారం సేకరిస్తోంది. అధిష్టానం దూతలను రంగంలోకి దింపి సీక్రెట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూలన చూసినా బీజేపీ పేరు వినిపించేలా కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఈ ప్రక్రియ జరుగుతున్నట్లు పార్టీ జాతీయ కార్యవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్లు చెబుతున్నారు. అధినాయకత్వం ఆదేశాలతో పార్టీ యాక్టివిటీ-స్లో ఒక్కసారిగా స్పీడ్ పెంచింది రాష్ట్ర నాయకత్వం. అయితే మేమిచ్చిన యాక్టివిటీ- పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారా? లేదా? అన్న వివరాలు కూడా ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. ఉత్తర భారతంలో ఇలాంటి ప్లాన్లనే అమలు చేసి సక్సెస్ అయిన బీజేపీ.. దక్షిణాదిన కూడా అదే ఫార్ములా ఉపయోగించి తెలంగాణాలో అధికార పగ్గాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రజా గోస, బీజేపీ భరోసా కార్యక్రమం ద్వారా విస్తృతంగా ప్రజల ముందుకు వెళ్తోంది. ఇప్పటికే పది రోజులుగా 5వేల సమావేశాలు ఏర్పాటు- చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మొత్తంగా ఇదే కార్యక్రమంలో బిజీబిజీగా ఉన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ జాతీయ అగ్రనేతలు 15 రోజుల్లో 11వేల సమావేశాలు నిర్వహించాలని టార్గెట్ విధించి పనిచేయించారు. ఈ సమావేశాల్లో రాష్ట్రంలో ముఖ్య నేతలతో పాటు- మండల స్థాయి నేతల వరకు పాల్గొనాలని ఆదేశించారు. సమావేశాల్లో పొల్గొనే నేతలకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. తీరా పది రోజులుగా సమావేశాలు జరుగుతున్నా కొంతమంది నేతలు బయటకు రావడంలేదన్న విషయాన్ని సీక్రెట్ సర్వేలో గుర్తించారు. కొంతమంది నాయకులు తమకు ఇచ్చిన కార్యాచరణ అమలు చేయడంలో సుముఖంగా లేరని సర్వేలో తేలింది. దీంతో ఇచ్చిన కార్యాక్రమాలను లైట్ తీసుకుంటు-న్న నేతలపై జాతీయ నాయకత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిద్దమైన అధిష్టానం పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు.