నిర్మల్ ప్రతినిధి, ఆగస్టు 9, ప్రభ న్యూస్ : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డా.బీఆర్ అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. నిర్మల్ మండలానికి చెందిన 94, దిలావర్ పూర్ మండలానికి చెందిన 56, సోన్ మండలానికి చెందిన 49, సారంగాపూర్ మండలానికి చెందిన 36, మామాడ మండలానికి చెందిన 24మందికి మొత్తం 278 మందికి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… బడుగు, బలహీనవర్గాల ఆడబిడ్డల వివాహాలకు ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా 1,00,116 రూపాయలను అందజేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి బాలికల విద్య కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.