హైదరాబాద్ : మాజీ ప్రధాని దేవగౌడ్ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు సంబంధించిన వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని, మహిళలను లైంగికంగా వేధించిన వ్యక్తి దేశం విడిచి ఎలా పారిపోయాడంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రజ్వల్ తప్పించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం సహకారం ఉందంటూ ఆయన ట్విట్ చేశారు. ఒక వేళ ప్రజ్వల్ రేవణ్ణకు కేంద్రం సహకారం లేనట్లైతే వెంటనే దేశానికి తిరిగి తీసుకొచ్చి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు.
కాగా, మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న వేధింపులను పట్టించుకోవడం లేదని, బిల్కిస్ బానో రేపిస్టులను విడుదల చేశారని కెటిఆర్ మండిపడ్డారు. ఇక బ్రిజ్ భూషణ్ సింగ్‌పై మహిళ రెజర్లు చేసిన ఆరోపణలను పట్టించుకోలేదంటూ.. ఇప్పడు ఇప్పుడు మరో ఘటన చోటు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై లైంగిక వేధింపుల విషయంలో బీజేపీ అనుసరిస్తున్న నిర్లక్ష్యపూరిత విధానం ఆశ్చర్యానికి గురి చేస్తోందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. కాగా , మాజీ ప్రధాని దేవగౌడ్ మనవడు ప్రజ్వల్ ఉన్న సెక్స్ వీడియోలు బయటకు రావడంతో అతడు జర్మనీకి పరారయ్యాడు. అతడి పెన్ డ్రైవ్ లో మూడు వేలకు పైగా సెక్స్ వీడియోలు ఉండటంతో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు సిట్ ను ఏర్పాటు చేసింది..