– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
చాలా రోజులుగా భూ వివాదంలో తన తండ్రిని టార్గెట్ చేస్తూ వస్తున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జాభవానీ ఇవ్వాల ఆయనపై మరో సీరియస్ కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేను ప్రశ్నించాల్సింది.. ఓడించాల్సింది ప్రజలే అని తుల్జాభవాని అన్నారు. ప్రజల ఆస్తిని తాను తిరిగి ఇచ్చేసినట్లు చెప్పారు. తన తండ్రి నుండి రూపాయి కూడా తీసుకోలేదన్నారు. కుటుంబం నుండి తనకు ఎలాంటి మద్దతు లేదని స్పష్టం చేశారు.
భూకబ్జా చేసినట్లు ఒక ఎమ్మెల్యే బహిరంగంగా చెప్పినప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే కూతురు నిలదీశారు. ఇటువంటి అవినీతిపరులకు పార్టీ టిక్కెట్ ఇవ్వకూడదని, సొంతగా పోటీ చేసినా సర్పంచ్‌గా కూడా తన తండ్రి గెలవలేడని చెప్పారు. కేవలం సీఎం కేసీఆర్ పేరు చెప్పుకొని మళ్లీ ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు.
తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని, తన వెనుక ఏ పార్టీ లేదని తుల్జాభవాని స్పష్టం చేశారు. కబ్జా చేసిన తన తండ్రిని వదిలేసి, తనపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. జనగామకు వెళ్లి అడిగితే తన తండ్రి గురించి ప్రతి ఒక్కరు చెబుతారన్నారు. ఇప్పుడిప్పుడే తన తండ్రి బాధితులు ఫోన్ చేస్తున్నారని, బయటకొస్తున్నారని చెప్పారు.