నిజామాబాద్ : జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వింత ఘటన చోటు చేసుకుంది. చనిపోయాడని భావించి ఓ వ్యక్తిని మార్చురీకి తరలించగా.. అతడిలో కదలికలు వచ్చాయి. దీంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా తిర్మన్‌పల్లికి చెందిన అబ్దుల్ గఫర్ రోజూవారీగా పనికి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి స్తంభానికి ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు వైద్యం కోసం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో శ్వాస ఆడకపోవడంతో కదలికలు లేకపోవటాన్ని గమనించారు. కుటుంబసభ్యులు అతడు మృతి చెందాడని భావించారు.
.దీంతో హైదరాబాద్ తీసుకెళ్లకుండా.. యూటర్న్ తీసుకొని నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అక్కడ గఫర్‌కు పోస్టుమార్టం చేసే క్రమంలో నోట్లో అమర్చిన పైప్‌లను తొలగించే క్రమంలో గఫర్‌లో కదలికలు వచ్చాయి. దీంతో షాక్ తిన్న వైద్య సిబ్బంది.. వెంటనే అతడిని ఐసీయూకు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన మళ్లీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో గఫర్‌కు చికిత్స అందిస్తుండగా.. అతడి పరిస్థితి మెరుగ్గా ఉంది. చనిపోయాడని శోకసంద్రంలో మునిగిపోయిన కుటంబసభ్యులకు అతడి చివరి నిమిషంలో బ్రతికి రావటంతో ఆనందం వ్యక్తం చేశారు.