పంజాగుట్ట: హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోని మొత్తం సిబ్బందిని ఒకే సారి బదిలీ చేశారు. పీఎస్‌లోని మొత్తం 86 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు బుధవారం జారీ చేశారు. ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డు వరకు అందరిని ఒకే సారి బదిలీ చేయడం సంచలనంగా మారింది. తొలిసారి పీఎస్ సిబ్బంది మొత్తాన్ని సీపీ బదిలీ చేశారు.
కాగా, మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు వివాదంలో ఇప్పటికే పలు ఆరోపణలు వెల్లువెత్తాయి.. అలాగే ఈ పీఎస్ నుంచి కీలక సమాచారం బయటకు పొక్కడంపై సీపీ సీరియస్ అయ్యారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు కీలక సమాచారం చేరవేస్తున్నారని సిబ్బందిపై సీపీ వేటు వేసినట్లు సమాచారం. వేటు పడ్డ సిబ్బందిని సిటీ ఆర్మ్డ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లోని వివిధ పీఎస్‌ల నుంచి సిబ్బందిని పంజాగుట్టకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి.