పెద్దపల్లి జిల్లాలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ రాజీనామా చేసినట్టుగా శనివారం ప్రకటించారు. తన రాజీనామా లేఖలను టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి పంపనున్నట్టుగా వెల్లడించారు. సోమారపు సత్యనారాయణతో పాటు రామగుండం నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నేతలు కూడా పార్టీని వీడారు. అయితే ఈ సందర్భంగా సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ.. పార్టీని వీడటం బాధగా ఉందని అన్నారు.
రామగుండం అభివృద్దికోసమే రాజీనామా చేసినట్టుగా సోమారపు సత్యనారాయణ తెలిపారు. తాను ఏ పార్టీలోకి వెళ్లేది లేదని చెప్పారు. తన అనుచరుల కోరిక మేరకు రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని తెలిపారు. ఇదిలాఉంటే, సోమారపు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని పెద్దపల్లి జిల్లాలో ప్రచారం సాగుతుంది.
ఇక, సోమారపు సత్యనారాయణ విషయానికి వస్తే గతంలో రామగుండం మున్సిపల్ చైర్మన్‌గా పనిచేశారు. 2009 ఎన్నికల్లో రామగుండం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా రామగుండం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2016లో టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2018 ఎన్నికల్లో రామగుండం నుంచి మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన సోమారపు సత్యనారాయణ ఓటమి పాలయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో విజయం సాధించిన కోరుకంటి చందర్ తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరడంతో.. సోమారపు సత్యనారాయణ గులాబీ పార్టీకి దూరమయ్యారు. ఆ వెంటనే బీజేపీ గూటికి చేరారు.