హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంపై మా అధ్యక్షుడు నరేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “సాయితేజ్, మా అబ్బాయి ఇద్దరూ మంచి స్నేహితులు. త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. సాయితేజ్ నా బిడ్డలాంటివాడు. నిన్న సాయంత్రం వీళ్లిద్దరూ మా ఇంటి నుంచే వెళ్లారు. వాళ్ల బైక్స్ సౌండ్ విని, వేగంగా వెళ్లొద్దని చెబుదామని బయటకు వచ్చాను. అంతలోనే ఇద్దరూ వెళ్లిపోయారు. బైకులు వేగంగా నడపొద్దని నాలుగు రోజుల క్రితం వీళ్లకి కౌన్సెలింగ్ ఇద్దామనుకున్నాను కూడా. ఇద్దరూ పెళ్లి కావలసిన వాళ్లు, మంచి వయస్సులో వున్న వాళ్లు. ఇలాంటి వయసులో రిస్కులు తీసుకోకూడదు. బైక్ రైడింగ్ చేయొద్దని సాయి తేజ్‌ను చాలా సార్లు హెచ్చరించాను. నేను ఎంత చెప్పినా నా మాటలు పట్టించుకోలేదు. తేజ్, మా అబ్బాయి కలిసి రైడింగ్ చేస్తారు. రైడింగ్‌పై ఇదివరకే ఇద్దర్నీ హెచ్చరించాను. గతంలో ఒకసారి నేను కూడా బైక్ ప్రమాదానికి గురైతే, మా అమ్మ నా చేత ఒట్టు వేయించుకుని, బైక్ నడపడం మానిపించారు. గతంలో కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, కోమటిరెడ్డిల కొడుకులు ఇలాంటి ప్రమాదాల వల్లే మరణించారు. వారి కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేదన్నారు. కుటుంబాలను, నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా వ్యవహరించాలి. ఇప్పుడు అపోలో ఆసుపత్రికి వెళ్లి సాయిని పరామర్శించాలని ఉన్నా, అక్కడి పరిస్థితులను బట్టి వెళ్లలేకపోతున్నాను. త్వరలోనే వెళ్లి కలుస్తాను. సాయి పూర్తి ఆరోగ్యంతో ఇంటికి రావాలని కోరుకుంటున్నాను” అని నరేశ్ చెప్పారు.
ఇది కూడా చదవండిః సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్.. మెగా అభిమానుల్లో టెన్షన్!