హైదరాబాద్ : నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కానిస్టేబుల్ వేధింపులు భరించలేక రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య చేసుకుంది. తన మరణానికి కానిస్టేబుల్ అనిల్, అతని భార్య కారణం అంటూ సెల్ఫీ వీడియోలో పేర్కొంది. హబ్సిగూడలోని ఐఐసీటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌గా మృతురాలు దీప్తి పనిచేస్తోంది. అదే ఐఐసీటీలో దీప్తి తండ్రి సంగీత్ రావు పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈ క్రమంలో ఐఐసీటీలో అనిల్ భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానని కానిస్టేబుల్ వద్ద సంగీతరావు రూ.రెండు లక్షలు తీసుకున్నారు.
అయితే కొన్ని నెలలు గడిచినా ఉద్యోగం ఇప్పించకపోవడంతో తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని కానిస్టేబుల్ అనిల్ దీప్తిపై ఒత్తిడి చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అనిల్ దీప్తిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి కేసులతో వేధింపులకు గురిచేశారు. దీంతో కానిస్టేబుల్ వేధింపులు భరించలేక దీప్తి సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్ చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.