మహబూబ్ నగర్ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందాలని, లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, ప్రత్యేక అధికారి రవి, జిల్లా శాసనసభ్యులు యేన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, వాకిటి శ్రీహరి, మధుసూదన్ రెడ్డి, కూచుకుల్ల రాజేష్, మేఘా రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డితో కలిసి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల, రేషన్ కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాల అమలుపై జరిగిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కార్యాచరణ సమన్వయ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూలంకషంగా సమీక్షించి సమర్థ నిర్వహణకు జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు విజయేందిర బోయి, బదావత్ సంతోష్, ఆదర్ష్ సురభి, బి.ఎం. సంతోష్, ఆయా జిల్లాల ఆదనవు కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26వ తేదీన ఈ నాలుగు పథకాలను ప్రారంభించనుందన్నారు. పథకాల అమలులో భాగంగా నిర్వహించే గ్రామ సభల్లో ఎమ్మెల్యేలు, ఇందిరమ్మ కమిటీలను భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రచార లోపo, సమన్వయం లోపo ఉండకూడదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పథకాలను అమలు చేయాలన్నారు.
కొత్తగా ప్రారంభించబోయే నాలుగు పథకాలు ఓ అద్భుతమని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో జరిగే గ్రామసభల్లో తాను, సహచర మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా రెండు, మూడు గ్రామాల్లో పాల్గొంటామని ఆయన తెలిపారు. ఐదు రోజుల కార్యక్రమ సమాచారం నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఉన్న వారికి పథకాల వర్తింపు పై క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొని ప్రసంగించారు.