Friday, November 22, 2024

Counter – నువ్వేనా మంత్రి…నే కాకూడ‌దా…. హ‌రీష్ పై విరుచుకుప‌డ్డ సీత‌క్క‌…

ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత సీతక్క మంత్రి హరీశ్ రావుపై మండిపడ్డారు. నువ్వు మంత్రి అయిన‌ప్పుడు నేను మంత్రిని కాకూడ‌దా అంటూ నిల‌దీసింది.. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారం స‌భ‌లో హ‌రీష్ మాట్లాడుతూ, ‘సీతక్క మంత్రి అవుతుందట’ అంటూ విమర్శించారు..దీనిపై సీత‌క్క ఘాటుగా స్ప‌దిస్తూ, అగ్గిపెట్టె దొరకని హరీష్ ఇప్పుడు కారుకూతలు కూస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. . ‘ఏ.. నేను మంత్రిని కావొద్దా? నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవద్దా’ అని మంత్రిని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలకు బడుగుబలహీన వర్గాలంటే గిట్టదని సీతక్క ఆరోపించారు. ములుగు మండలంలోని కన్నాయిగూడెంలో సీతక్క ఎన్నికల ప్రచారం మాట్లాడుతూ.. తాను ప్రజల మనిషినని, ప్రజల కోసం , ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే వ్యక్తినని చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకు కష్టపడుతున్న తనపై ప్రభుత్వానికి ఎందుకింత కక్ష అని సీతక్క నిలదీశారు.

ములుగులో తనను ఓడించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ , కేటీఆర్ లు నియోజకవర్గంలో డబ్బులు వెదజల్లుతున్నారని ఆరోపించారు. నోట్ల కట్టలతో ప్రజలను కొనాలని చూస్తున్నారు కానీ ములుగు ప్రజలు అమ్ముడుపోరనే విషయం వారికి తెలియదన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకోవాలని ఓటర్లకు ఆమె సూచించారు. వాళ్లు పంచే డబ్బంతా గత పదేళ్లలో ప్రజల నుంచి దోచుకున్నదేనని చెప్పారు. వారిచ్చే డబ్బులు తీసుకుని ఓటు మాత్రం తనకే వేయాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా కాలంలో సేవ చేసినందుకా.. ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకున్నందుకా.. ఎందుకని న‌న్ను ఓడించాల‌ని అనుకుంటున్నార‌ని ప్రశ్నించారు. మంత్రిని కావడం తన కల అని, ప్రజల ఆశీర్వాదం ఉంటే తప్పకుండా మంత్రిని అవుతానని చెప్పారు. దొరల పాలన కావాలా? లేక ప్రజల వద్దకే పాలన అందించే కాంగ్రెస్ కావాలా? నిర్ణయించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ వాళ్లు డబ్బులను నమ్ముకుంటే తాను మాత్రం మిమ్మల్నే నమ్ముకున్నానని అక్కడి ప్రజలను ఉద్దేశించి చెప్పారు. వాళ్లు గెలిస్తే డబ్బులు గెలిచినట్లు.. తాను గెలిస్తే ములుగు ప్రజలు గెలిచినట్లని సీతక్క పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement