Friday, November 22, 2024

Seethakka Call – కార్పొరేట్ కంపెనీలు … గ్రామాలకు తరలండి

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కార్పొరేట్ కంపెనీలు తమ వంతు సహకారం అందించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. చివరి వరుసలో వున్న వారి అభివృద్ధి కోసం సామాజిక బాధ్యతగా కంపెనీలు ముందుకు రావాలని కోరారు. ఒక్కో కార్పొరేట్ కంపెనీ..ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పరచాలని సూచించారు. హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో మంత్రి సీతక్క, serp ceo దివ్యా దేవరాజన్, ములుగు కలెక్టర్ దివాకర్ లతో ఐటీ దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, క్వాల్కమ్, బోష్, గ్రాన్యుల్స్ ఇండియా, టీసీఎస్, ఉషా, నిర్మాన్ తదితర కంపెనీల ప్రతినిధులు బుధవారం భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మనతో పాటు చుట్టూ ఉన్న వాళ్లు సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో కార్పొరేట్ కంపెనీలు పని చేస్తే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్పొరేట్ కంపెనీలు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని స్థానిక సమస్యలను పరిష్కరించడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.

- Advertisement -

ఆదిలాబాద్, ములుగు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే కార్పొరేట్ కంపెనీలు కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని మార్పు చేసి చూపించాయని మంత్రి గుర్తు చేశారు. విద్య, వైద్యం,ఉపాధి, పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీరు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో చేయూతనిచ్చేలా కంపెనీలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సహాయం చేస్తే గుండెల్లో పెట్టి చూసుకుంటారని పేర్కొన్నారు. ప్రజాసేవలో సంతృప్తి పొందిన వారే అసలైన శ్రీమంతులని తెలిపారు.

ములుగు జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను, అవసరాలను, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ దివాకర్ వివరించారు. మంత్రి పిలుపుమేరకు ములుగు వంటి నియోజకవర్గాల్లో సిఎస్ఆర్ నిధులను వెచ్చిoచేందుకు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి. ఆయా కంపెనీలను మంత్రి సీతక్క అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement