Wednesday, November 20, 2024

TS: కేసీఆర్ మెజార్టీ చూసి ప్రతిపక్షాలకు దిమ్మ తిరగాలి… కేటీఆర్

బిక్కనూర్, నవంబర్ 1 (ప్రభ న్యూస్) : కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ కు వచ్చిన మెజార్టీ చూసి ప్రతిపక్షాలు దిమ్మతిరిగి పోవాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో అధికార పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రతి పార్టీ కార్యకర్త అంకితభావంతో పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. కామారెడ్డి ప్రాంతం ఉద్యమాలకు గడ్డగా మారిందని తెలిపారు. ఈ ఉద్యమ గడ్డపై సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారని గుర్తు చేశారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ ప్రాంతం నుండి సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి షబ్బీర్ అలీ తప్పుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక్కడ ఏమో ఉద్ధరిద్దామని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. అలాంటి వారికి ఓటు ద్వారా బుద్ధి చెప్పి దూరంగా ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. పలు రాష్ట్రాలకు ప్రధాన కేంద్రంగా కామారెడ్డి ప్రాంతం ఉందన్నారు. రానున్న రోజుల్లో కామారెడ్డి జిల్లా వ్యాపార పరంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న భారత రాష్ట్ర సమితిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. కామారెడ్డి ప్రాంతానికి తాగునీరు, సాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు. ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తరలించి రైతుల కాళ్లు కడుగుతామని చెప్పారు. 200 పింఛన్ ఇవ్వనోడు రూ.4000 పింఛన్ ఎలా ఇస్తాడని కాంగ్రెస్ నాయకులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం మొదటిసారిగా ఈ ప్రాంతం నుండి ప్రారంభం అయిందని ఆయన తెలిపారు.

ఎంతోమంది తెలంగాణ ఉద్యమ నేతలు ఇక్కడే ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి వారిని పార్టీ ఎప్పుడూ మర్చిపోదని చెప్పారు. నల్ల బెల్లం విషయంలో అప్పట్లో ఇక్కడ ఉద్యమం స్టార్ట్ అయిందని తెలిపారు. అలాంటి సమయంలో ప్రస్తుత సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఈ ప్రాంతం మరింత అభివృద్ధి కావాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన చెప్పడంతో కేసీఆర్ ముందుకు వచ్చారని ఈ సందర్భంగా ఆయన సూచించారు. 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ఏమి చేసిందని ప్రశ్నించారు. 9 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. గోదావరి జలాలతో కామారెడ్డి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రతి కార్యకర్త సైనికునిగా పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన తెలిపారు. పార్టీలో ఎవరు తప్పు చేసినా క్రమశిక్షణ చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

- Advertisement -

పార్టీ శ్రేణులు అందరూ కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఎంతో అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటి నాయకుడు సీఎం కేసీఆర్ కోసం ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా తన పదవిని త్యాగం చేశారని గుర్తు చేశారు. అలాంటి నాయకునికి భవిష్యత్తులో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, జిల్లా అధికార పార్టీ అధ్యక్షులు ముజ్జిబుద్దిన్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిరుమలరెడ్డి, బిక్కనూర్ రాజంపేట ఎంపీపీలు గాల్ రెడ్డి, స్వరూప జడ్పిటిసి పద్మ నాగభూషణం గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, పట్టణ సర్పంచ్ వేణు, మండల రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ రామచంద్రం, సిద్ధిరామేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పురం రాజమౌళి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్లు లింగాల కిష్టా గౌడ్, సిద్ధిరాములు విద్యావేత్త సుభాష్ రెడ్డి, రాజంపేట మండల అధ్యక్షులు బలవంతరావు, పార్టీ సీనియర్ నాయకులు ఎం జి వేణుగోపాల్ గౌడ్, ప్రతాపరెడ్డి, సత్యనారాయణ రామారావు, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యులు మాధవి, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement