హైదరాబాద్, ఆంధ్రప్రభ : అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న విధ్వంసానికి సంబంధించి కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అల్లర్లు, రైల్వే ఆస్తుల ధ్వంసం, రైళ్లకు నిప్పు పెట్టడం వెనక కొందరు కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఒకరిద్దరు తొలుత రైల్వే బోగీల్లోకి వెళ్లి నిప్పు పెట్టినట్టుగా కనిపిస్తున్న కొన్ని వీడియోలు ఇప్పుడు వెలుగులోకి కూడా వచ్చాయి.
ఈ వీడియోల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పృధ్వీరాజ్ కూడా ఉన్నాడని బహిర్గతమైంది. ఇతడి ప్రమేయాన్ని ముందుగానే గుర్తించిన పోలీసులు కేసులో రెండవ ముద్దాయిగా చేర్చారు. రైలు బోగీలోకి వెళ్లి పేపర్లకు నిప్పు పెట్టి సీట్లకు నిప్పటించాడని పోలీసులు వీడియోల ఆధారంగా తేల్చారు. తాను చేస్తున్న పనులను పృథ్వీరాజ్ వీడియోలు కూడా తీయించుకున్నాడని పోలీసులు తెలిపారు. ఒకరిద్దరు ఇలాంటి చర్యలకు దిగిన తర్వాత మరికొందరు రైల్వే ఆస్తులు ధ్వంసం చేయడానికి రైల్వే బోగీలకు నిప్పు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కామారెడ్డి జిల్లాకు చెందిన మధుసూదన్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే.
పృధ్వీరాజ్‌తో పాటు హింసాకాండతో సంబంధం ఉన్న మరో తొమ్మిది మందిని అరెస్టు చేసి బోయిగూడలోని రైల్వే కోర్టులో హాజరు పరిచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి రైల్వే పోలీసులు 56 మందిని నిందితులుగా గుర్తించారు. విధ్వంసంలో వాట్సప్ గ్రూపులు కీలకంగా వ్యవహరించాయని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎనిమిది వాట్సప్ గ్రూపుల అడ్మిన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఒక వాట్సప్ గ్రూప్ అడ్మిన్ రమేష్‌ను పోలీసులు విచారించగా, మరో ఎనిమిది ఘ్రూపులకు చెందిన అడ్మిన్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రైల్వే పోలీసులకు అప్పగించారు. సుబ్బారావును ఇప్పటికే రైల్వే పోలీసులతో పాటు తెలంగాణ, ఏపీ పోలీసులు ప్రశ్నించారు. సుబ్బారావు గత కొన్నాళ్ళుగా ఆర్మీలో చేరాలనుకునే వారిలో పలువురికి శిక్షణ ఇచ్చారని, వీరిలో కొంత మంది నుంచి లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు ఫీజుగా వసూలు చేయగా, మరి కొంత మంది ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లను తన వద్ద ఉంచుకున్నాడని తేలింది. సుబ్బారావు ప్రోద్భలంతోనే వాట్సప్ గ్రూపులు రైల్వే స్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ, హకీంపేట ఆర్మీ సోల్జర్స్, ఛలో సికింద్రాబాద్ ఏఆర్‌వో 3, ఆర్మీ జీడీ 2021 మార్చ్ ర్యాలీ, సీఈఈ సోల్జర్స్ పేరుతో క్రియేట్ చేశారని, ఈ గ్రూపుల ద్వారా పెద్దఎత్తున రెచ్చగొట్టేలా వ్యవహరించారని దర్యాప్తు అధికారులు గుర్తించారు.
వాట్సప్ గ్రూపుల ద్వారా ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టేందుకుగానూ ఓ ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీ కీలకంగా వ్యవహరించిందని దర్యాప్తు అధికారులు గుర్తించారని సమాచారం. మరోవైపు మంగళవారం మరో 15 మంది అనుమానితులను విచారించారు. శుక్రవారం జరిగిన ఘటనలలో పోలీసు కాల్పులు, లాఠీచార్జీ తదితర ఘటనలలో గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. వీరందరినీ వెంటనే తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు సికింద్రాబాద్ రైల్వే కోర్టులో హాజరు పరిచారు.
బయట పడ్డ మేనేజర్ పాత్ర
నరసరావుపేటలోని సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు సుబ్బారావు ప్రమేయంపై ఒక స్పష్టతకు వచ్చిన పోలీసులు అదే అకాడమీలో మేనేజర్‌గా పని చేస్తున్న శివ ప్రమేయం కూడా ఉందని గుర్తించారు. అరెస్టు చేసిన వారు ఇచ్చిన సమాచారం, వాట్సప్ గ్రూపులలో సేకరించిన ఆధారాలన్నింటినీ క్రోడీకరించుకున్న పోలీసులు శివ ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారని తెలుస్తోంది. శివను అరెస్టు చేస్తే సుబ్బారావుకు సంబంధించిన మరిన్ని వివరాలు బహిర్గతమయ్యే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు.