కొత్త ప్రభుత్వం కోసం రాష్ట్ర సచివాలయం ముస్తాబవుతోంది. సర్కార్ మార్పుతో ముఖ్యమంత్రి, మంత్రులు.. సలహాదార్ల కార్యాలయాలు, ఛాంబర్లు, పేషీలను ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికే సీఎం సహా మంత్రులు, వారి కార్యదర్శులకు సంబంధించిన బోర్డులు తొలగించగా.. మంత్రుల పేషీల్లోని దస్త్రాలు, ఇతరత్రాలను ఆయా శాఖలు, విభాగాలకు అప్పగిస్తున్నారు.
సచివాలయం నుంచి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, దస్త్రాలు తీసుకెళ్లకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఇప్పటికే ఖాళీ అయిన ముఖ్యమంత్రి ఛాంబర్‌ను సీఎస్ శాంతికుమారి పరిశీలించారు. మంత్రివర్గ సమావేశ మందిరాన్ని పరిశీలించి అక్కడున్న ఫర్నీచర్, వసతులపై ఆరాతీశారు. ఇవాళ్టిలోగా అన్నింటినీ పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని అధికారులను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. మరోవైపు ముఖ్యమంత్రి, మంత్రి మండలి ప్రమాణస్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రమాణస్వీకారానికి వచ్చే వారికి తగిన బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు.