సామాజిక బాధ్యతగా విద్యార్థులను తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నామని ఎంఎల్ఆర్ విద్యాసంస్థల కార్యదర్శి, తెరాస మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో సృజనాత్మక ఆలోచనలు వెలికతీయడానికి మర్రి లక్ష్మణ్ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్ అనునిత్యం ప్రయత్నిస్తుందన్నారు. దానికి అనుగుణంగా మర్రి లక్ష్మణ్ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్, ఐఏఆర్ఈ విద్యాసంస్థల జాతీయ సేవా విభాగం విద్యార్థులతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టిందని మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. దీనివల్ల తమ కళాశాలల విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంపొందించే అవకాశముంటుందన్నారు.
అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వారి సృనాత్మకతను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. తాను నిర్వహిస్తున్న విద్యాసంస్థలైన మర్రి లక్ష్మణ్ రెడ్డి విద్యాసంస్థలు, ఐఏఆర్ఈ ఆధ్వర్యంలో ఇదివరకు పలు సేవాకార్యక్రమాలు నగర వ్యాప్తంగా నిర్వహించామన్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య సమాచారాన్ని నిక్షిప్తం చేసి హెల్త్ ప్రొఫైల్ తయారు చేశామన్నారు. కోవిడ్ సమయంలో తమ కళాశాలల విద్యార్థుల ఎన్ఎస్ఎస్ (జాతీయ సేవాపతకం) ఆధ్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు (ఆహార పదార్థాల పంపిణీ, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయడం) నిర్వహించినట్లు తెలిపారు. మేడ్చల్ జిల్లాలోని పలు గ్రామాలను దత్తత తీసుకుని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వించామని గుర్తు చేశారు. నగరంలోని పలు చోట్ల హెల్త్ క్యాంప్ లు సైతం నిర్వహించి తమ సామాజిక బాధ్యతను నెరవేర్చిన సందర్భం మరచిపోలేని అనుభూతులను ఇచ్చిందన్నారు. మనిషి మనుగడకు బాట వైజ్ఞానికం, నిత్యం మారుతున్న కాలానికి అనుగుణంగా మానవ జీవన విధానంను సాంకేతికంగా మరింత విస్తరించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ.. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ లు నవీన్ రావు, కె.జనార్ధన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ జె.సత్యనారాయణ రావు, డీఈఓ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital