Friday, November 22, 2024

నేటి నుంచే స్కూళ్లు రీ ఓపెన్​.. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం బోధన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నుంచి బడిగంట మోగనుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. సెలవులు పొడిగింపు లేదని ఈమేరకు ఆమె స్పష్టం చేశారు. పాఠశాలల పున:ప్రారంభంపై అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరంలోనే ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియంలో విద్యాబోధన ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు బైలింగ్వల్‌ పాఠ్యపుస్తకాలను అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.7289.54 కోట్లతో దశల వారీగా చేపడుతున్నామని, మొదటి దశలో 9123 పాఠశాలల్లో రూ.3,497.62 కోట్లతో 12 రకాల మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, ఉచిత యూనిఫామ్‌, సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నామని గుర్తు చేశారు.

ఉచిత ఆరోగ్య పరీక్షలను సైతం నిర్వహించి తగుచికిత్సలను అందజేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను, అందిస్తున్న నాణ్యమైన విద్యను పొంది భవితకు బంగారుబాట వేసుకోవాలని విద్యార్థులకు మంత్రి సూచించారు. ఇంగ్లీష్‌ మీడియం బోధనకుగానూ 1.04లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. బడిబాటలో భాగంగా ఇప్పటి వరకు 70వేల 698 మంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించినట్లు వివరించారు. బడిబాట కార్యక్రమం ఇంకా వారం రోజులు కొనసాగుతోందన్నారు.

నెల రోజులు బ్రిడ్జి కోర్సు…
ఇంగ్లీష్‌ మీడియం బోధన నేపథ్యంలో పిల్లలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు నెల రోజు పాటు బ్రిడ్జి కోర్సు మాదిరిగా తరగతులు నిర్వహించాలని టీచర్లకు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమవుతుండటంతో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు స్వాగతం పలకాలన్నారు. పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా మంచినీటి కనెక్షన్లు ఉండేలా చూడాలన్నారు. రూ.120 కోట్లతో పాఠ్యపుస్తాలు ముద్రించినట్లు మంత్రి తెలిపారు. 1.67 కోట్లు బుక్స్‌ను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.

బండి సంజయ్‌పై మంత్రి ఫైర్‌…
మన ఊరు-మన బడికి కేంద్రం నిధులు ఇచ్చిందని బీజేపీ నేతలు అబద్దాలు చెబుతున్నారని, విష ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. రూ.2700 కోట్ల నిధులను కేంద్రం ఎక్కడ ఇచ్చిందో చెప్పాలని బండి సంజయ్‌కు ప్రశ్నించారు. ఒకపక్క టెట్‌ వాయిదా వేయాలని, మరో పక్క 20 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని బీజేపీ ద్వంద నీతితో వ్యవహరిస్తుందన్నారు. టెట్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని మంత్రి చెప్పారు.

- Advertisement -

రాష్ట్రంలో గౌరవ ప్రదంగా టీచర్లను చూస్తూ, వారికి ప్రభుత్వం అండగా ఉందని, మన దగ్గర టీచర్లకు ఉన్న జీతాలు మరెక్కడా లేవన్నారు. రాష్ట్రానికి నవోదయ స్కూల్స్‌, గిరిజన వర్సిటీ, ఐఐఐటీ, ఐఐఎం, మెడికల్‌ కాలేజీలను తెచ్చి బండి సంజయ్‌ మాట్లాడాలని తెలిపారు. దేశమంతా ఇచ్చి తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి ఆగ్రహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement