తెలంగాణలో కరోనా వైరస్ పంజా విజృంభిస్తోంది. స్కూళ్లు సూపర్ స్ర్పెడర్లు అవుతున్నాయి. దీంతో ఒక్కో పాఠశాలలోనే పదుల సంఖ్యలో విద్యార్థులు కరోనా బారినపడటం కలకలం రేపుతోంది. కేవలం రెండు, మూడు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 104 మంది విద్యార్థులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది.
మేడ్చల్ జిల్లా బాలానగర్ మండలానికి చెందిన మైనార్టీ గురుకుల పాఠశాలలో 36 మంది విద్యార్థినులు కరోనా బారినపడ్డారు. మొత్తం ఈ స్కూళ్లో 165 మంది ఉండగా.. తొలుత ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లో 18 మందికి, ఆ తర్వాత మరో 18 మందికి పాజిటివ్ తేలింది. మొత్తం 36 మందిపై కరోనా కోరలు చాచింది. ఇక కామారెడ్డిలోని కస్తూర్బా విద్యాలయంలో 32 మంది విద్యార్థినుల్లో కూడా కరోనా బయటపడింది. మంచిర్యాలలోని బాలికల పాఠశాలలో 28 మందిలో కరోనా బయటపడగా. అలాగే ఆరుగురు తల్లిదండ్రులకు కరోనా బయటపడింది.
ఇక కరీంనగర్ సప్తగిరి కాలనీలోని గవర్నమెంట్ స్కూళ్లో అయిదుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడికి కరోనాసోకింది. హైదరాబాద్‌లోని న్యూ బోయిన్‌పల్లి బాపూజీనగర్‌లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహంలోనూ ముగ్గురు విద్యార్థులు కరోనా బారినపడ్డారు. బెల్లంపల్లిలోని ఓ ఉపాధ్యాయురాలికి, చెన్నూరులో ఓ ఉపాధ్యాయుడికి పాజిటివ్ తేలింది. స్కూళ్లలో పరిస్థితి చూస్తోంటే ఆందోళన కలిగిస్తోంది. గతంలో తెలంగాణలో ఒకే చోట ఇలా పదుల సంఖ్యలో కేసులు బయటపడటం ఎన్నడూ జరగలేదు. దీంతో పిల్లలను బడులకు పంపాలంటేనే తల్లిదండ్రులు వణికిపోతున్నారు.
మంచిర్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో.. కరోనా విజృంభించింది. 175 మందికి పరీక్షలు నిర్వహించగా 35 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. విద్యార్థులతో పాటు ఆరుగురు తల్లిదండ్రులకు వైరస్ సోకింది. దీంతో వైరస్ బాధితులను హోం క్వారంటైన్‌లో ఉండాలని స్కూలు ప్రిన్సిపాల్ సూచించారు. కరోనా వ్యాప్తితో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలోని చెన్నూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిన్న ఓ ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వగా.. ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా పాఠశాలలోని ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పెరుగుతున్న కరోనా కేసులపై విద్యాశాఖ మల్లగుల్లాలు పడుతోంది. పాఠశాలలను ఇలాగే కంటిన్యూ చేస్తే కరోనా కేసులు మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉంది దీంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. దీనిపై ప్రభుత్వమే అధికారికంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు.