Friday, November 22, 2024

రాజ్యసభ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల.. బండ ప్రకాశ్ రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : టీఆర్ఎస్ నేత బండ ప్రకాశ్ రాజ్యసభ సభ్యత్వానికి ఇచ్చిన రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 2024 ఏప్రిల్ 2 వరకు ఉన్న ఈ పదవీకాలాన్ని భర్తీ చేయడం కోసం ఉప ఎన్నిక నిర్వహించనుంది. ఇందుకోసం మే 12న నోటిఫికేషన్ జారీ కానుంది. నామినేషన్ల దాఖలుకు మే 19 చివరి తేదీ కాగా, మే 20న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు మే 23ను చివరితేదీగా నిర్ణయించారు. మే 30న ఉదయం గం. 9.00 నుంచి సాయంత్రం గం. 4.00 వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం గం. 5.00 నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే రాష్ట్ర శాసనసభలో సంఖ్యాబలం చూస్తే టీఆర్ఎస్‌కు ఎదురేలేని పరిస్థితి ఉన్నందున, ఈ ఎన్నిక పూర్తిగా ఏకగ్రీవమయ్యే అవకాశముంది. ఒకవేళ ఎవరైనా పోటీపడినా.. గెలుపొందే అవకాశమే లేదు.

బండ ప్రకాశ్‌ను శాసనమండలి సభ్యుడిగా తీసుకున్నందున ఆయన తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. గత డిసెంబర్ 4 నుంచి ఖాళీగా ఉన్న ఈ పదవికి ఉప ఎన్నిక నిర్వహించి భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణలో కోవిడ్-19 ప్రొటోకాల్ అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచనలు జారీ చేసింది.

ప్రకాశ్ స్థానంలో ఢిల్లీకి ఎవరు?
సరిగ్గా చెప్పాలంటే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించే వరకు మాత్రమే పదవీకాలం మిగిలున్న ఈ సీటు కోసం టీఆర్ఎస్ అధినేత ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్ర ప్రభుత్వంతో, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో ఢీ అంటే ఢీ అంటున్న గులాబీ దళపతి కే. చంద్రశేఖర రావు జాతీయస్థాయిలోనూ తన కార్యాకలాపాలను విస్తరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు తోడుగా ఢిల్లీలో టీఆర్ఎస్ వాణి బలంగా వినిపించే వ్యక్తినే ఎంపికచేస్తారన్న చర్చ జరుగుతోంది. పార్టీ కార్యకలాపాల విషయానికొస్తే కేసీఆర్ కుమార్తె కవితకు జాతీయస్థాయిలో ఈ మధ్యనే బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో ఈ స్వల్పకాలిక రాజ్యసభ పదవిని కూడా ఆమెకు అప్పగించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో చట్టసభలోనూ టీఆర్ఎస్ స్వరాన్ని బలంగా వినిపించే అవకాశం దొరుకుందని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement