Tuesday, November 26, 2024

Telangana | రెండ్రోజుల్లో టీచర్ల బదిలీల షెడ్యూల్‌.. వారం తర్వాత దరఖాస్తుల ప్రక్రియ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ రెండ్రోజుల్లోగా విడుదల కానుంది. అయితే దరఖాస్తుల ప్రక్రియ మాత్రం వారం తర్వాత షురూ కానుందని సమాచారం. మొదట షెడ్యూల్‌ను విడుదల చేసి ఆ తర్వాత దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. సంక్రాంతి పండుగ రోజు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో బదిలీలు, పదోన్నతుల అంశంపై సమావేశమైన మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల చేస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ అధికారులు మంగళ, బుధవారాలు వరుసగా భేటీ అయ్యారు.

బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను తీసుకొని విధివిధానాలపై కసరత్తు చేస్తున్నారు అధికారులు . బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను 32 నుంచి 35రోజుల వరకు పూర్తి చేసేలా షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అయ్యింది. అయితే కలెక్టర్లు కంటి వెలుగు కార్యక్రమంలో బిజీగా ఉండటంతో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కాస్త ఆలస్యం అయ్యేలా ఉందన్న సమాచారమూ వినిపిస్తోంది.

ఉపాధ్యాయుల సంఘాల నేతలతో విద్యాశాఖ అధికారులు బుధవారం ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు కేసుల కారణంతో భాషా పండితులకు ఇప్పుడు బదిలీలను చేపట్టమని అధికారులు చెప్పడం తగదని, వారికి కూడా బదిలీలు, ప్రమోషన్లు కల్పించాలని కోరారు. 317 జీవోతో నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయడంతోపాటు 13 జిల్లాల స్పౌజ్‌ బదిలీలను షెడ్యూల్‌ విడుదలకు ముందే పూర్తి చేయాలని ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్‌ చేసింది. ఉపాధ్యాయులందరికీ బదిలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని అధికారులకు యుఎస్‌పీసీ నేతలు కోరారు.

- Advertisement -

అలాగే బదిలీలకు కటాఫ్‌ తేదీ డిసెంబర్‌ 31 లేదా జనవరి 31గా నిర్ణయించాలని కోరారు. బదిలీలు, పదోన్నతుల సీనియారిటీ లిస్టులు లోపాలు లేకుండా తయారు చేయించాలన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 ప్రకారం పదోన్నతులు, బదిలీలు చేపడితే ఎటువంటి న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం లేదని లోకల్‌ కేడర్‌ జీటీఏ సంఘం నేతలు అధికారులకు విన్నవించారు. బదిలీలకు కనీస సర్వీసును రెండు సంవత్సరాల నుంచి జీరో సర్వీసుకు తగ్గించాలని జాక్టో నేతలు కోరారు. మూడు సంవత్సరాల సర్వీసు ఉన్న వారికి బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని టీచర్‌ సంఘాల నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement