Saturday, November 23, 2024

భయపెడుతున్న డెంగ్యూ జ్వరాలు.. ముసురుకుంటున్న అంటు వ్యాధులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రజలను డెంగీ హడలెత్తిస్తోంది. ఒకవైపు బారీ వర్షాలు, మరోవైపు దోమల స్వైరవిహారంతో ప్రతీ ఇంట్లో కనీసం ఇద్దరు ఈ వ్యాధిబారిన పడుతున్నారు. డెంగీతో ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతుండగా ప్రయివేటులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మారుమూల, గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి మరింత విషమంగా ఉందన్న సమాచారం వస్తోంది. వర్షాకాలంటే అంటేనే వ్యాధుల సీజన్‌ కావడంతో రాష్ట్రంలోని ప్రతి పల్లె, పట్టణం మంచం పట్టింది. ప్రమాదకరంగా డెంగీ దోమలు అన్ని జిల్లాల్లో ప్రజలకు, వైద్య, ఆరోగ్యశాఖకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. చిన్నా, పెద్ద, వృద్ధులు అనే తేడా లేకుండా అంతా డెంగీతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో మూడు రెట్లు అధికంగా డెంగీ కేసులు నమోదయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే మూడు రెట్లు అధనం అంటే… నమోదుకాని అనధికారిక డెంగీ కేసులు మరిన్ని ఉన్నట్లు తెలుస్తోంది. వాతావరణంలో మార్పులు, నీటి నిల్వ ప్రదేశాలు పెరగడంతో దోమల వ్యాప్తి పెరుగుతోంది. ఈ ఏటా కూడా వర్షాలు సమృద్ధిగా కురవడంతో డెంగీ వ్యాధికారక ఎడిస్‌ దోమల సంతానోత్పత్తి భారీగా పెరిగిపోయిందని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు మాసం వరకు రాష్ట్రంలో 9298 డెంగీ కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, కరీంనగర్‌, ఖమ్మం, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ, పెద్దపల్లి జిల్లాల్లో పెద్ద ఎత్తున డెంగీ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తం మీద హైదరాబాద్‌లో సెప్టెంబరు నెలలో అత్యధికంగా 897, రంగారెడ్డిలో 705, మేడ్చల్‌538, ఖమ్మం 318, సంగారెడ్డి 290, కరీఒనగర్‌ 233, మహబూబ్‌నగర్‌లో 205, నల్గొండలో 173 డెంగీ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న డెంగీ కేసుల్లో 40శాతం హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి.
డెంగీ బారిన పడిన ప్రతి 10మందిలో కనీసం ముగ్గురిలో ప్లేట్‌ లెట్స్‌ పడిపోతున్నాయి. అంతర్గత అవయవాల్లో బ్లడ్‌ బ్లిdడింగ్‌ జరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ప్లేట్‌ లెట్స్‌ 20వేలకు పడిపోతేనే ప్రమాదమని, అప్పుడే కృత్రిమంగా ప్లేట్‌లెట్స్‌ ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. డెంగీ అనగానే భయంతో ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి అవసరం లేకున్నా ప్లేట్‌లెట్స్‌ ఎక్కించుకుని ఇల్లు, ఒల్లు గుల్ల చేసుకోవద్దని సూచిస్తున్నారు. బొప్పాయి, ఆకుకూరలు, పండ్ల రసాలతో ప్లేట్‌లెట్స్‌ను వృద్ధి చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

జాగ్రత్తలు తీసుకోవాల్సిందే…

- Advertisement -

సాయంత్రం కాగానే ఇళ్ల తలుపులు మూసివేయాలని, పిల్లలు, వృద్ధులతోపాటు ప్రతీ ఒక్కరూ శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. మస్కిటో కాయిల్స్‌, దోమల నివారణా సాధనాలను వాడాలని సూచిస్తున్నారు. తీవ్ర జ్వరం, వాంతులు వికారం, కండరాల వాపు, తీవ్ర నీరసం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని, మెడికల్‌ షాపుకు వెళ్లి ఏదో ఒక జ్వరం మాత్ర వేసుకుని నిర్లక్ష్యంగా ఉండొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అప్రమత్తమైన వైద్య, ఆరోగ్యశాఖ…

రోజు రోజుకూ డెంగీ ప్రమాదకరరీతిలో వ్యాపిస్తుండడంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలు దోమకాటు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విడవని జ్వరం ఉంటే ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని లేనిపక్షంలో ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఓ వైపు డెంగీ, మరో వైపు మలేరియా, టైఫాయిడ్‌ వంటి విషజ్వరాలు దాడి చేస్తున్న ప్రమాదకర పరిస్థితుల్లో రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీలు) డెంగీ టెస్టింగ్‌ కిట్లు, ఔషధాలను అందుబాటులో ఉంచారు. ఏరియా, జిల్లా ఆసుపత్రులతోపాటు పెద్దాసుపత్రుల్లో ప్రత్యేకంగా డెంగీ, విషజ్వరాల వార్డులను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. డెంగీ కేసులు పెరుగుతున్నాయని, అయితే తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్న పేషెంట్ల సంఖ్య తక్కువగానే ఉందని హైదరాబాద్‌ ఫీవర్‌ ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, డెంగీ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement