హైదరాబాద్, ఆంధ్రప్రభ : మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ చైర్మన్ మీనాక్షినటరాజన్ సోమవారం నుంచి యాదాద్రి- భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని వార్థ వరకు ‘ సర్వోదయ పాదయాత్ర చేపట్టనున్నారు. స్వాతంత్య్ర సమరయోదుడు, వినోబాబావే భూదాన్ పోచంపల్లిలో చేపట్టిన భూదాన్ కార్యక్రమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఇక్కడి నుంచి సర్వోదయ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో 26 రోజుల పాటు ఈ సర్వోదయ పాదయాత్ర ఉంటుందని, అనంతరం వార్థా వరకు జరుగుతోందని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు.
ఆదివారం ఆయన రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, కన్వీనర్ రాచమల్ల సిద్ధేశ్వర్, కాంగ్రెస్ నాయకులు కొమురయ్య, రవితో కలిసి మీడియాతో మాట్లాడారు. పేదల భూ సమస్యల పరిష్కారం కోసం సర్వోదయ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో ఒక రోజు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పాల్గొంటారని తెలిపారు. ప్రతి రోజు కాంగ్రెస్ నాయకులు పాదయాత్రలో పాల్గొంటారని వివరించారు. ఈ యాత్ర ప్రారంభ రోజు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వచ్చే శనివారం టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఆదివారం టీ పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ సర్వోదయ పాదయాత్రలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.