వికారాబాద్ జిల్లా దామస్తాపూర్ లో దారుణం జరిగింది. ప్రశ్నించిన వాళ్లను స్థానిక సర్పంచ్ చావబాదుతున్నాడు. నీళ్లు, డ్రైనేజీ సమస్యలపై ప్రశ్నించిన శ్రీనివాస్ అనే వ్యక్తిపై సర్పంచ్ జైపాల్ రెడ్డి ఎగిరెగిరి తన్నాడు. ”నీకెందుకురా పో” అంటూ తరిమేశాడు. దామస్తాపూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగిన ఓ గొడవ గురించి పెట్టిన పంచాయితీకి సర్పంచ్ జైపాల్ రెడ్డి హాజరయ్యాడు. ఈ క్రమంలో ఊరిలో ఉన్న నీటి సమస్య ప్రస్తావన వచ్చింది. దీంతో గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే స్థానికుడు.. పంచాయతీ పరిధిలో చాలా సమస్యలు ఉన్నాయని ప్రస్తావించాడు. రెండు నెలలుగా నీళ్లు రాక ఇబ్బందులు పడుతుంటే.. ఏం చేస్తున్నారని.. ప్రశ్నించాడు. నీటి సమస్య, డ్రైనేజీ సమస్య మీద వెంటనే దృష్టి పెట్టాలని సర్పంచ్‌కు సూచించాడు. దీంతో కోపోద్రిక్తుడైన సర్పంచ్ జైపాల్‌రెడ్డి.. బూతుల దండకంతో వీరంగం సృష్టించాడు. దుర్భాషలాడుతూ.. కొట్టటం మొదలుపెట్టాడు. కిందపడేసి.. తన్నుతూ.. ముష్టిగుద్దులతో విరుచుకుపడ్డాడు. అయితే, వెంటనే అక్కడున్న స్థానికులు సర్పంచ్‌ను నివారించి పక్కకు తీసుకెళ్లారు. గ్రామ సమస్యలను ప్రస్తావిస్తే… ఇలా దాడి చేస్తారా అని బాధితుడు శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో సర్పంచ్ జైపాల్‌రెడ్డిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement