Friday, November 22, 2024

Big story | వర్షాల పట్ల సర్కార్‌ నజర్‌.. ముంపు నివారణ చర్యలతో లోతట్టు ప్రాంతాలు సేఫ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రాణ నష్టం లేకుండా వీలైనన్ని ఎక్కువ జాగ్రత్తలను తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మున్సిపల్‌ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సేవల్లో నిమగ్నం అవ్వాలని సూచించారు. సెలవులను రద్దు చేసినట్లు వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లో పురపాలక శాఖ అధికారులు, అడిషనల్‌ కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన మంత్రి కేటీఆర్‌.

అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. హుస్సేన్‌ సాగర్‌ వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం వాటిల్లకుండా చూడటమే మొదటి ప్రాధాన్యతగా పని చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వరద నీరు నిలిచిన పట్టణాల్లో మరిన్ని సహాయక చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. శిధిల భవనాల నుంచి ప్రజలను వెంటనే తరలించాలని అధికారులకు తెలిపారు.

- Advertisement -

పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పురపాలక శాఖ అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడరని చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫోన్లు, మాధ్యమాల ద్వారా సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. కుంభవృష్టి వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటి వరకు సాధ్యమైనన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణనష్టాన్ని నివారించామన్నారు. హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందన్నారు.

చెరువుల బలోపేతం చేసే కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. 135 చెరువులకు గేట్లు బిగించామని, డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ అధికారులు, సిబ్బంది విస్తృతంగా పని చేస్తున్నారన్నారు. గతంలో ఇలాంటి భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయం అయ్యేవని, ఈ సారి నాలా డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమం వలన వరద ప్రభావం కొంత మేర తగ్గించగలిగామని స్పష్టం చేశారు.

రాజకీయాలు వద్దు.. వీలైతే సహాయం చేయండి

ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మానీ ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నిరంతరం పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా చిల్లర విమర్శలు చేయొద్దని సూచించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు వర్షాన్ని ఎదుర్కొనేందుకు పని చేస్తున్నాయన్నారు. వారి మనస్సులు నొచ్చుకోకుండా మాట్లాడితే బాగుంటుందని ప్రతిపక్ష నేతలకు సూచించారు. వరద పెరిగే ప్రాంతాల్లో ఉన్న పౌరులను ఎప్పటికప్పుడు అలర్ట్‌ చేస్తున్నామని చెప్పారు.

ఎక్కడికక్కడ కంట్రోల్‌ రూమ్‌లు, తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. చెరువులకు గండి పడే ప్రమాదం ఉన్న చోట్ల సైతం సమీక్షిస్తున్నట్లు చెప్పారు. మూసి వరదను ఎప్పటికప్పుడు అధికారులు పర్యావేక్షిస్తున్నారన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వరంగల్‌ నగరానికి వెళ్లాలని మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అవసరమైతే తాను నేడు వరంగల్‌కు స్వయంగా వెళ్లనున్నట్లు చెప్పారు.

వర్షాలు తగ్గాక మూసారాం బాగ్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు షురూ

అంబర్‌పేట్‌లోని ముసారాం బాగ్‌ బ్రిడ్జ్‌ మూసి పరివాహక ప్రాంతాన్ని మంత్రి కేటీఆర్‌, మలక్‌పేట్‌ ఎమ్మెల్యే బల్లాల, అంబర్‌పేట్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌తో పాటు స్థానిక కార్పొరేటర్‌లతో కలిసి పరిశీలించారు. మూసి ఉధృతిపై చేపడుతున్న సహాయ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలోనే మూసారాంబాగ్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 52 కోట్ల నిధులు కేటాయించామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడతామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement