Friday, November 22, 2024

సంత్ సేవ‌ల‌ను గుర్తించింది ముఖ్యమంత్రి కేసిఆరే : మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి

మునుగోడు : సంత్ సేవాలాల్ ను, ఆయ‌న సేవ‌ల‌ను తొలుత గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే నని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిపేర్కొన్నారు. సమాజ హితం కోరుకునే అటువంటి మహానీయుడి జ‌యంతి వేడుకలు అధికారికంగా జరుపుతున్నది కూడా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అన్నారు. అది ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పతనానికి మచ్చు తునక అని ఆయన కొనియాడారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నారాయణపురం మండల కేంద్రంలో గురువారం సాయంత్రం జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిరిజన సాంప్రదాయ పద్దతిలో మంత్రి జగదీష్ రెడ్డిని నిర్వాహకులు వేదిక మీదకు తీసుకెళ్లారు. అనంతరం వారి పద్దతిలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. అధికారికంగా పండుగలు జరుపడమే కాకుండా ఆయా పండుగల రోజున కుల మతాలకు అతీతంగా పేదలకు దుస్తులు పంపిణీ చేసిన ఘనత మ‌న ముఖ్యమంత్రికి మాత్రమే దక్కిందన్నారు. సంత్ సేవాలాల్ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోయిన మహనీయుడ‌ని కొనియాడారు. అటువంటి మహనీయుడు దేశానికే గర్వకారణంగా నిలుస్తార‌న్నారు. మానసిక రుగ్మతలను రూపుమాపిన సంఘజీవి సేవాలాల్ అన్నారు. తాండలను గ్రామ పంచాయతీ లుగా మార్చాల‌ని రెండు దశాబ్దాలుగా ఉన్న డిమాండ్ ను స‌ఫ‌లం చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దే న‌న్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, భోనగిరి యాదాద్రి జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ,మునుగోడు నియోజకవర్గ టి ఆర్ యస్ ఇన్చార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement