హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రజలు పల్లెల నుంచి పట్నం బాట పడుతున్నారు. సొంత గ్రామాలకు వెళ్లిన వారంతా హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతున్నారు. తెలంగాణలోని జిల్లాల నుంచి హైదరాబాద్కు మంగళవారం నుంచే తిరుగు ప్రయాణమవ్వగా, బుధవారం మధ్యాహ్నం తర్వాత ప్రయాణికుల సంఖ్య ఇంకాస్త పెరిగింది. నగరానికి వస్తున్న ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి.
బుధవారం నుంచి కళాశాలలు, గురువారం నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతున్నాయి. అదేవిధంగా సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన ఉద్యోగవ్యాపార రంగాలకు చెందిన వారు సైతం నగరానికి తిరుగు ప్రయాణాలు అవుతున్నారు. దీంతో వారికి తిప్పలు తప్పడంలేదు. హైదరాబాద్ నగరానికి వచ్చే రహదారులపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆంధ్రా నుంచి వచ్చే ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ గేట్ వద్ద హైదరాబాద్ వైపుగా వస్తున్న వాహనాలతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఈక్రమంలోనే ట్రాఫిక్ పోలీసులు ముందస్తుగా ఊర్ల నుంచి వచ్చే వాహనాలను దృష్టిలో ఉంచుకొని జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు చేపట్టారు.సొంతూళ్లకు వెళ్లినవారిలో అత్యధికులు బుధవారం రోజు తిరుగు ప్రయాణాలు చేస్తే… ఇక ఆంధ్రప్రదేశ్లోని స్వస్థలాలకు వెళ్లినవారి రద్దీ గురువారం వరకు ఉండనుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారితో బస్సుల్లో రిజర్వేషన్లన్నీ పూర్తయ్యాయి. ఏపీలోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, భీమవరం, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు భారీగా చేరుకుంటున్నారు.