- సందర్శిస్తున్న కలెక్టర్ క్రాంతి వల్లూరు
- అగ్ని ప్రమాదంపై విచారణకు పోలీసులను ఆదేశించిన కలెక్టర్
- కలెక్టరేట్ లోని అన్ని శాఖల కార్యాలయాలలో ఫైర్ సేఫ్టీ పరికరాలను తనిఖీ చేయాలని ఆదేశం
సంగారెడ్డి, నవంబర్ 25 (ఆంధ్రప్రభ) : సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లోని మొదటి అంతస్తులో ఉన్న సీపీఓ కార్యాలయంలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అగ్నిప్రమాదం జరిగిన సీపీఓ కార్యాలయాన్ని సోమవారం పరిశీలించారు. అగ్ని ప్రమాదం వివరాలను సంబంధిత శాఖ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం… షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు వివరించారు. అయితే ప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షించారు.
ఈ సందర్భంగాకలెక్టర్ మాట్లాడుతూ… ఈ అగ్ని ప్రమాదం ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ఘటనలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి, అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఘటనకు సంబంధించి అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను సేకరించి, ప్రమాదం వెనుక ఉన్న కారణాలను ఖచ్చితంగా నిర్ధారించాలని పోలీసులకు సూచించారు.
ఈ అగ్ని ప్రమాదం తర్వాత, కలెక్టర్ క్రాంతి వల్లూరు కలెక్టరేట్ లోని అన్ని కార్యాలయాల భద్రతా ప్రమాణాలను పునఃసమీక్షించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల కార్యాలయాల్లో ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా అనేది పరిశీలించాలని, ఇలాంటి సంఘటనలు కలెక్టరేట్ లో పునరావృతం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.