తనపై నమోదైన కేసు కోట్టివేయాలంటూ పిటిషన్
స్కాష్ పిటిషన్ పై నేటి సాయంత్రం విచారణ
హైదరాబాద్ – సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పుష్ప-2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడంపై చిక్కడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో దీనిని అత్యవసర పిటిషన్‌గా విచారించాలని బన్ని తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టును కోరారు. ఈనెల 11వ తేదీనే పిటిషన్ వేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
క్యాష్ పిటిషన్‌ను వేసినట్లు పోలీసులకు కూడా తెలిపినట్లు చెప్పారు. అయితే, అత్యవసర పిటిషన్‌ను ఉదయం 10:30 గంటలకే మెన్షన్ చేయాలి కదా అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. ఈ పిటిషన్‌ను సోమవారం విచారిస్తామని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్‌గా స్వీకరించాలని న్యాయవాది నిరంజన్ రెడ్డి కోరారు. సోమవారం వరకూ ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన హైకోర్టు స్క్వాష్ పిటిషన్ పై విచారణను నేటి సాయంత్రం చేపడతామని పేర్కొంది.. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ అంశాన్ని సైతం విచారణ చేస్తామని వెల్లడించింది.