దిల్ రాజుకు అందజేసిన అల్లు అరవింద్, మైత్రి టీమ్
కిమ్స్ హాస్పటల్ లో నేడు శ్రీతేజ్ కు పరామర్శ
ఆరోగ్య పరిస్థితిపై సుకుమార్ , అల్లు అరవింద్
హైదరాబాద్ – సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ‘పుష్ప 2’ టీమ్ భారీగా సాయం అందజేసింది.. ఈ ఘటనలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను చూసేందుకు బుధవారం అల్లు అరవింద్, సుకుమార్, నిర్మాత దిల్ రాజు హాస్పిటల్‌కు చేరుకున్నారు. శ్రీతేజ్‌ని పరామర్శించిన అనంతరం శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ఈ అమౌంట్‌ని శ్రీతేజ్ కుటుంబానికి ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..‘‘శ్రీతేజ్ ఇపుడు కోలుకుంటున్నాడు. అతనికి వెంటిలేటర్ తీసేశారు. శ్రీతేజ్ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు పరిహారంగా ఇవ్వనున్నాం. అల్లు అర్జున్ నుంచి రూ. కోటి రూపాయలు, ‘పుష్ప 2’ నిర్మాతలు 50 లక్షలు, సుకుమార్ రూ. 50 లక్షల రూపాయలను మొత్తంగా రూ. 2 కోట్ల రూపాయలను ఎఫ్ డి సి చైర్మెన్ దిల్ రాజుకు అందచేయడం జరిగింది’’ అని తెలిపారు.