Friday, November 22, 2024

క్వారీల పేరుతో ఇసుక దోపిడీ.. రేవంత్ రెడ్డి

క్వారీల పేరుతో ఇసుక దోపిడీ పాల్పడుతున్నారని, ఒకే పర్మిషన్ మీద నాలుగు లారీల ఇసుక తరలిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన పాదయాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలం తనుగుల ఇసుక క్వారీని రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇసుక దోపిడీ ప్రజలకు చూపెట్టడానికి ఇక్కడకు వచ్చానన్నారు. అక్రమ ఇసుక తరలించి కోట్లు కూడబెడుతున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలు వాడి అక్రమ ఇసుక తరలిస్తున్నారన్నారు. అధికారులను అడుగుదామంటే ఒక్క అధికారి కూడా అందుబాటులో లేడన్నారు. ఇక్కడ మొత్తం ప్రైవేట్ సామ్రాజ్యంగా మారి అక్రమ ఇసుక తరలిస్తున్నారన్నారు. అక్రమ ఇసుకపై ఫిర్యాదులు చేసిన వారిని ఇబ్బందులకు గురి చేసి దాడులకు పాల్పడుతున్నారన్నారు.

భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. మానేరు వాగులో ఈ రకంగా ఇసుక తీస్తే రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం ఎడారిగా మారే అవకాశముందన్నారు. ఇసుక మాఫియాలో కేసీఅర్ కుటుంబం భాగస్వామ్యం ఉంది కాబట్టి ఇంత అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్నారు. ఇసుక మాఫియాపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ బండి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇసుక దోపిడీని ప్రజలకు చూపించి కోర్టుకు వెళ్లి అక్రమ క్వారీలను మూసేసే వరకు పోరాటం కొనసాగిస్తుందన్నారు. అక్రమ గ్రానైట్ ఇసుక మైనింగ్ వ్యాపారం కేసీఆర్ కుటుంబానికి ఆదయ వనరుగా మారిందన్నారు. ఇసుక మాఫియా వల్లనే కాళేశ్వరం కొట్టుకుపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి పాదయాత్ర కొత్త కాదు.. మా పాదయాత్ర వల్ల కేసీఆర్ కుర్చీ కదులుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పై బీఅర్ఎస్ పార్టీ దాడులు చేస్తుందన్నారు. దాడులు చేసి సమస్యను పక్క దారి పట్టించే ప్రయత్నం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ దాడులకు భయపడదు.. తప్పకుండా ప్రజా సమస్యల పై పోరాడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement