Friday, November 22, 2024

TS : సమ్మక్క, సారక్కల నామస్మరణతో… తెలంగాణ ఆధ్యాత్మిక వాతావరణం.. మంత్రి కొండా సురేఖ‌

మేడారం జాతరను పురస్కరించుకొని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మేడారం జాతర ఆదివాసీ ఆత్మగౌరవానికి, తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతిక అని మంత్రి పేర్కొన్నారు. సమ్మక్క, సారక్కల నామస్మరణతో నేడు యావత్ తెలంగాణలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని తెలిపారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా సమ్మక్క, సారక్కలు వీరోచిత పోరాటం చేసి, వీరమరణం పొందినా తెలంగాణ ప్రజల గుండెల్లో సదా జీవించే ఉన్నారన్నారు.

ఆత్మగౌరవమే ఆభరణంగా బతుకుతున్న తెలంగాణ బిడ్డలకు సమ్మక్క, సారక్కలే స్ఫూర్తి ప్రదాతలు అని మంత్రి పేర్కొన్నారు. సమ్మక్క, సారక్కల స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ గొప్ప సంకల్ప బలంతో పోరాటం చేసి నియంతృత్వ పాలనకు చరమగీతం పాడిందన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కొలువైన వెంటనే మేడారం జాతరను నిర్వహించుకునే అవకాశం కలగటం అదృష్టంగా భావిస్తున్నామని మంత్రి అన్నారు. మేడారం మహా జాతర ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతరగా నిలవడం తెలంగాణ ఖ్యాతిని, జాతర ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటుతున్నదని అన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మేడారం జాతరను అత్యంత వైభవోపేతంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సకల ఏర్పాట్లను చేసిందని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు 24 గంటలు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో మేడారం జాతరకు జాతీయ హోదా తేలేకపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ హోదా తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించిన అన్ని సౌకర్యాలను వినియోగించుకుంటూ, గుండెల నిండా భక్తితో అమ్మవార్లను దర్శించుకొని, క్షేమంగా ఇళ్ళకు చేరుకోవాలని ప్రజలకు మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement