ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడి ప్రాణాలను చేవెళ్ల పోలీసులు కాపాడి శభాష్ అనిపించుకున్నారు. చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన విఠలయ్య కుమారుడు ఆనంద్(21)చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. ఇంట్లో చిన్న చిన్న గొడవ కారణంగా తండ్రి తిట్టాడని మనస్తాపం చెంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయి టప్పర్ 77 పౌడర్ ను వాటర్ లో కలుపుకొని తాగాడు. తన కొడుకు పురుగుల మందు తాగుతూ వాట్సాప్ స్టేటస్ పెట్టాడని తండ్రి పోలీసులకు సమాచారం అందిచాడు.
తక్షణమే గాలింపు చేపట్టి జియో టాక్ ద్వారా యువకుడి లొకేషన్ గుర్తించారు. చేవెళ్ల పట్టణ కేంద్రంలోని కొనగట్టు శివాలయం సమీపంలోకి పోలీసులు వెళ్లి చూడగా చెట్టుకింద పడుకొని యువకుడు నోట్లో నుంచి నురుగులు కక్కుతున్నాడు. వెంటనే ఆనంద్ ను పోలీసులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడు తాగిన టప్పర్ 77 పౌడర్ పురుగుల మందును కక్కించారు. ప్రస్తుతం ఆనంద్ చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు.
యువకుడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి యువకుని ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ నరేష్, హోంగార్డ్ రమేష్ లను చేవెళ్ల ఏసీపీ కిషన్, సీఐ లక్ష్మారెడ్డిలు అభినందించారు. అదేవిధంగా చేవెళ్ల ప్రజలు, బాధిత కుటుంబ సభ్యుల నుంచి వారు ప్రశంసలు అందుకున్నారు.