హైదరాబాద్ – సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనలో దుర్మార్గపు సంస్థ QNet పాత్రపై సమగ్ర విచారణ జరగాలని టిఆర్ ఆర్టీసీ ఎండి, ఐపిఎస్ అధికారి సజ్జాన్నార్ ప్రభుత్వాన్ని కోరారు.. ఈ మేరకు ఆయన వరుసగా ట్విట్లు చేశారు.
“ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి.బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. మోసపూరిత సంస్థల కదలికలపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ నిఘా పెట్టాలి. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరగడం బాధాకరం. ఈ దుర్ఘటనలో మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఆరుగురు యువతీయువకులు మృతి చెందడం కలిచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. వారి కుటుంబసభ్యులకు ఎల్లవేలలా అండగా నిలుస్తాం. భారీ డబ్బును ఆశచూపి అమాయకులను మోసం చేస్తోన్న క్యూనెట్ బాగోతం ఈ అగ్నిప్రమాదంతో మరోసారి బయటపడింది.
క్యూనెట్ అమాయకులైన ఆరుగురిని పొట్టనబెట్టుకుంది. ఆ కాంప్లెక్స్‌లో బీఎం5 సంస్థ పేరిట కాల్ సెంటర్ నిర్వహిస్తూ తెరవెనక క్యూనెట్ ఎంఎల్‌ఎం దందా సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 40 మందికిపైగా యువతీయువకులు అక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. క్యూనెట్ ఏజెంట్లు ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.1.50-3 లక్షలు కట్టించుకున్నట్లు మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మోసపూరిత క్యూనెట్ పై అనేక కేసులు నమోదు చేసిన, ఈడీ ఆస్తులను జప్తు చేసిన తీరు మారడం లేదు. యువతీ యువకుల్లారా! అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్ లాంటి మోసపూరిత ఎంఎల్‌ఎం సంస్థల మాయలో పడకండి. మీ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోకండి. ఎంఎల్‌ఎం సంస్థలు అరచేతిలో వైకుఠం చూపిస్తూ యువతను ఆకర్శిస్తూ బుట్టలో వేసుకుంటున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మోసపూరిత సంస్థల విషయంలో భవన యాజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సంస్థ మోసపూరితమైందా? కాదా? అని ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకుని అద్దెకి ఇవ్వాలి. భవన యజమానులు అధిక అద్దెకు ఆశపడి.. ఇలాంటి మోసాలకు బాధ్యులు కావొద్దు అంటూ హితవు పలికారు..