Tuesday, November 26, 2024

TS: సాధారణ ప్రయాణీకులకు సజ్జనార్ కీలక రిక్వెస్ట్..

తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6వేల ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ఈ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా సాధారణ ప్రయాణీకులకు కీలక రిక్వెస్ట్ చేశారు.


‘తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6వేల ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నాం. రెండేళ్లకో సారి జరిగే ఈ మహాజాతరలో భక్తుల రద్దీకి అనుగుణంగానే ఈ 6 వేల ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ నడపుతోంది. జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు తిప్పుతున్నందున.. రెగ్యులర్ సర్వీసులను తగ్గించడం జరిగింది.

దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కావున జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనుసుతో సహకరించాలని సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. జాతర పూర్తయ్యేవరకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని వారిని కోరుతున్నాను. తెలంగాణకే తలమానికమైన ఈ జాతరను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.’ అని ట్వీట్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement