హిందు మనోభావాలను కించపరచడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేం కాదని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఎల్లుండి రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా నిజాం కాలేజీ లో ఏర్పాటు చేసే లైవ్ స్ర్టీమింగ్ కార్యక్రమ పనులకు ఆయన భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎల్లుండి రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా నిజాం కాలేజీ లో బిగ్ స్క్రీన్ ద్వారా లైవ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సాంస్కృతిక కార్యక్రమాలు,ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షoగా చూసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
అయోధ్య లో అనేక తవ్వకాలు జరిగిన తరువాత చివరికి అక్కడ రాముడి మందిరం ఉందని తేల్చి చెప్పాయన్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. 1951 లో సోమానాదుని మందిర ప్రారంభోత్సవాన్ని సైతం అనాడు నెహ్రూ వ్యతిరేకించారని తెలిపారు. హిందు మనోభావాలను కించపరచడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేం కాదన్నారు. లౌకికవాదం అంటే హిందు మనోభావాలను అవమానించడమా..? అని ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేయకుండా శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠకు మద్దతు తెలుపాలని పిలుపు ఇచ్చారు.